అడిస్ అబాబా: ఇథియోపియాలో ఆ దేశ ప్రభుత్వం శుక్రవారం ఎమర్జెన్సీని
ప్రకటించింది. గత కొంతకాలంగా ఉత్తర అమ్హారా ప్రాంతంలో ఫెడరల్ భద్రతా దళాలకు
స్థానిక మిలీషియాలకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇక ఇదే వారంలో ఇథియోపియన్
నేషనల్ డిఫెన్స్ ఫోర్స్, ఫానో మిలీషియా గ్రూప్ మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు
జరిగినట్లు స్థానిక మీడియా నివేదించింది. పొరుగున ఉన్న టైగ్రే ప్రాంతంలో
రెండు సంవత్సరాల పాటు జరిగిన అంతర్యుద్ధం కారణంగానే ఈ ఘర్షణలు చెలరేగినట్లు
చెబుతోంది ఇథియోపియా ప్రభుత్వం. సాధారణ న్యాయ వ్యవస్థ ఆధారంగా ఈ దారుణాలను
నియంత్రించడం కష్టతరంగా మారినందుకే అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సిన అవసరం
ఏర్పడిందని ప్రధాన మంత్రి అబీ అహ్మద్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
మొదటగా ప్రభుత్వం తరపున ఆర్డర్‌ను తిరిగి అమలు చేయాల్సిందిగా ఫెడరల్ అధికారుల
సాయం కోరామని అయినా కూడా ఘర్షణలను నియంత్రించడం కష్టతరం కావడంతో ప్రత్యామ్నాయం
లేని పరిస్థితుల్లో ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చిందని ప్రధాన మంత్రి అబీ
అహ్మద్ కార్యాలయం ప్రకటించింది. ఎమర్జన్సీ అమల్లో ఉండగా బహిరంగ సభలను నిషేధం.
అలాగే ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారెంట్లు లేకుండా అరెస్టులు జరుగుతాయని ఏ
ప్రకటనలో పేర్కొంది. అవసరాన్ని బట్టి కర్ఫ్యూ విధించదానికి కూడా వెనుకాడమని
ప్రకటనలో తెలిపింది.