కొత్త పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ : నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ
వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , లోక్సభ స్వీకర్ ఓంబిర్లాతోపాటు
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, ఎంపీలు, పలువురు సీఎంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణసింగ్, లోక్సభ స్పీకర్
ఓంబిర్లాతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలి ప్రసంగం చేశారు.
ఇది ప్రజల ఆకాంక్షల ప్రతిబింబం : ‘దేశ వికాస యాత్రలో ఎప్పటికీ నిలిచిపోయే
కొన్ని గడియలు వస్తాయి. అమృతోత్సవ వేళ చరిత్రాత్మక ఘటనలో ప్రజలు
భాగస్వాములయ్యారు. ఇది కేవలం భవనం కాదు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షల, కలల
ప్రతిబింబం. ప్రపంచానికి భారత్ దృఢ సంకల్ప సందేశం ఈ కొత్తభవనం ఇస్తుంది.
స్వాతంత్ర్య సమరయోధుల కలల సాకార మాధ్యమంగా, ఆత్మనిర్భర భారత్కు సాక్షిగా ఇది
నిలుస్తుంది. నవ భారత్ కొత్త మార్గాలు నిర్దేశించుకుంటూ ముందుకెళ్తోంది.
కొత్త ఆలోచనలు, సంకల్పంతో భారత్ ప్రగతి పథాన పయనిస్తోంది. ప్రపంచం మొత్తం మన
దేశ సంకల్పం, అభివృద్ధిని గమనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
పేర్కొన్నారు.
ప్రపంచానికి నేతృత్వం వహించే దిశగా భారత్ : ‘దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు కొత్త
పార్లమెంటు భవనం ద్వారా నెరవేరుతాయి. చరిత్రాత్మకమైన రోజు దేశ ప్రజలందరూ
గర్వపడాలి. గత పార్లమెంటు భవనం ప్రగతికి మార్గదర్శకంగా నిలిచింది. స్వాతంత్ర్య
ప్రాప్తి, రాజ్యాంగ నిర్మాణం వంటి అనేక చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచింది.
మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త భవనం ఆవశ్యకత ఏర్పడింది. ఆధునిక, సాంకేతిక
పరిజ్ఞానంతో నూతన భవనం నిర్మాణం జరిగింది. మున్ముందు సభ బాధ్యతలు మరింత పెరిగే
అవకాశం ఉంది. మరింత మెరుగైన సభా కార్యకలాపాల కోసమే ఈ కొత్త భవన నిర్మాణం
జరిగింది. రెండున్నరేళ్ల స్వల్ప వ్యవధిలోనే నిర్మించడం హర్షణీయం. రానున్న
రోజుల్లో ప్రపంచ యవనికపై భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది. ప్రపంచానికి
నేతృత్వం వహించే విధంగా భారత్ మారుతుందని డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్
నారాయణసింగ్ అన్నారు.