ఒక నాయకుడు హైటెక్ అంటూ ఊదరగొట్టాడని ఎద్దేవా
రాష్ట్ర ప్రజలు తలెత్తుకునేలా కేసీఆర్ చేశారని వ్యాఖ్య
సంగారెడ్డి : తెలంగాణ మంత్రి హరీశ్ రావు మరోసారి ఏపీ రాజకీయాలపై వ్యాఖ్యలు
చేశారు. ఇద్దరు నేతల వల్ల ఏపీ బొక్కబోర్లా పడిందని ఆయన అన్నారు. గతంలో ఒక
నాయకుడు హైటెక్ అంటూ ఊదరగొట్టాడని ఎద్దేవా చేశారు. ఏపీ వాళ్లది ప్రచారం
ఎక్కువగా ఉంటుందని, మనది పని ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మహారాష్ట్ర,
కర్ణాటక, గుజరాత్ లకు వెళ్లి చూస్తే తెలంగాణ గొప్పదనం ఏమిటో తెలుస్తుందని
అన్నారు. రాష్ట్ర ప్రజలు తలెత్తుకునేలా కేసీఆర్ చేశారని చెప్పారు. కేంద్ర
ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొడుతోందని విమర్శించారు. కేంద్ర ఉద్యోగులు,
ఇతర రాష్ట్రాల ఉద్యోగుల కంటే ఎక్కువ వేతనాలను తెలంగాణ ఉద్యోగులు
పొందుతున్నారని చెప్పారు. తెలంగాణకు రావాల్సిన రూ. 1.30 లక్షల కోట్లను
ఇవ్వకుండా కేంద్రం ఇబ్బంది పెడుతోందని హరీశ్ మండిపడ్డారు. ధరణి వల్లే రైతుల
సమస్య పరిష్కారం అయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ
దళారీ వ్యవస్థ రాజ్యమేలుతుందని అన్నారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా
నిలవాలంటే కేసీఆర్ మూడోసారి రావాలని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ పాలకులకు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అని ఆర్థికశాఖ మంత్రి
హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన
పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ది ప్రచారం తక్కువ పని ఎక్కువ అని, కాని
ఏపీలో నాయకులు మాత్రం ప్రచారం ఎక్కువ, పని తక్కువ అని విమర్శలు గుప్పించారు. ఆ
రాష్ట్ర పాలకుల తీరువల్లే ఈరోజు ఏపీ వెల్లకిలా పడిందని విమర్శించారు. నాటి
పాలకులు తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుందని, హైదరాబాద్‌లో రోజూ కర్ఫ్యూ
ఏర్పాటు చేయాలని ఎగతాళి చేశారని గుర్తు చేశారు. వీరికి పరిపాలన చేతకాదు. కేవలం
ఉద్యమం తప్ప అని అన్నారు. విద్యుత్ ఉండదు.. నిరుద్యోగం తాండవిస్తుందన్నారు.
కాని ఈరోజు తెలంగాణ ఆ మాటలు అన్నింటిని పటాపంచలు చేస్తూ దేశానికే దిక్సూచిగా
నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి చూడాలనుకుంటే.. పక్క
రాష్ట్రం వెళ్లి చూడాలని పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి
హరీశ్‌రావు చురకలు అంటించారు. అనంతరం ఆయన హైదరాబాద్ కూకట్పల్లి
నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ కాలనీలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి
శంకుస్థాపన చేశారు.