ఫైవ్ స్టార్ హోటల్ కూడా నిర్మించాలని రహేజా గ్రూప్ ఆసక్తిగా ఉంది
రహేజా గ్రూప్‌కు అన్ని విధాలుగా సపోర్టు ఇస్తాం
ఒక్క ఫోన్‌కాల్‌తో అందుబాటులో ఉంటాం
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
విశాఖపట్నం : ఇనార్బిట్ మాల్తో 8 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆంధ్ర
ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రెండున్నర ఎకరాలను
ఐటీ కోసం కేటాయిస్తారని, విశాఖలో ఒక ఆణిముత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు అని
తెలిపారు. విశాఖ అభివృద్ధికి ఈ మాల్ దోహదపడుతుందని, మాల్ నిర్మాణంతో విశాఖ
రూపురేఖలు మారిపోతని పేర్కొన్నారు. ముందుగా కైలాసపురం వద్ద ఇనార్బిట్ మాల్‌కు
భూమి పూజ చేశారు. రూ. 600 కోట్లతో 15 ఎకరాల స్థలంలో మాల్‌ను నిర్మిస్తున్నారు.
జీవీఎంసీ చేపట్టిన రూ. 136 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. విశాఖపట్నం
చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు పూల వర్షంతో విశాఖ వాసులు స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ది పనులు చూసి ఆయనకు ధన్యవాదాలు తెలిపేందుకు
మహిళలు భారీగా తరలి వచ్చారు.
దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్‌కు విశాఖ వేదికైంది. 17 ఎకరాల సువిశాల
విస్తీర్ణంలో మూడు దశల్లో కె.రహేజా గ్రూపు అభివృద్ధి చేయనున్న ఇనార్బిట్
మాల్ తొలి దశ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం భూమి పూజ
నిర్వహించారు. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో
ఇనార్బిట్ మాల్ నిర్మాణం కానుంది. దీనికి అదనంగా పార్కింగ్ కోసం ఏకంగా
నాలుగు లక్షల చదరపు అడుగులను అభివృద్ధి చేయనున్నారు. 2026 నాటికి దీన్ని
అందుబాటులోకి తేవాలని రహేజా గ్రూపు నిర్దేశించుకుంది. 250కిపైగా అంతర్జాతీయ
బ్రాండ్లకు వేదికగా మారనున్న ఈ మాల్ ద్వారా 8,000 మందికి ప్రత్యక్షంగా,
పరోక్షంగా ఉపాధి లభించనుంది. మాల్ నిర్మాణం కోసం పోర్టు అథారిటీకి చెందిన 17
ఎకరాలను 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. రెండో దశలో ఐటీ క్యాంపస్‌ను
అభివృద్ధి చేస్తారు. 3,000 మంది పనిచేసే విధంగా సుమారు 2.5 లక్షల చదరపు అడుగుల
విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను 2027 నాటికి అందుబాటులోకి తెస్తారు. మూడో దశలో
ఫోర్ స్టార్ లేదా ఫైవ్ స్టార్ హోటల్‌ను 200 గదులు, బాంకెట్ హాళ్లతో
నిర్మిస్తారు. పూర్తి పర్యావరణహితంగా భవనాన్ని నిర్మించనున్నట్లు రహేజా
గ్రూపు వెల్లడించింది.