ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లు తమ ఖాతాలు సస్పెండ్ అయ్యాయని పేర్కొంటూ పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఇన్స్టాగ్రామ్ యాజమాన్యం స్పందించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు ట్వీట్ చేసింది. ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ ఫోటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం నెలకొంది. పలువురు వినియోగదారులు తమ ఖాతా పనిచేయడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. కారణం లేకుండానే తమ ఖాతా సస్పెండ్ అయినట్లు చూపిస్తోందని కొందరు, తమ అకౌంట్ క్రాష్ అయిందని మరికొందరు పోస్టులు చేశారు. మొబైల్ యాప్‌లోనే కాకుండా వెబ్‌వర్షన్‌లోనూ ఇలానే వస్తుందని పలువురు పేర్కొన్నారు. దీనిపై ఇన్‌స్టా యాజమాన్యం స్పందించింది. ‘‘ఇన్స్టాగ్రామ్ ఖాతాలను యాక్సెస్ చేయడంలో కొందరు వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మా దృష్టికి వచ్చింది. ఈ సమస్య పరిష్కారం కోసం మేము ప్రయత్నిస్తున్నాం. సేవల పట్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు’’ అని ఇన్స్టాగ్రామ్ ట్వీట్ చేసింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇన్‌స్టా ఖాతాలు సస్పెండ్ అయ్యాయని చూపిస్తున్న స్క్రీన్‌షాట్స్‌ను కొందరు ట్విటర్లో పోస్టు చేశారు. తాము ప్రైవేట్ ఖాతాలను నిర్వహిస్తున్నామని, మార్గదర్శకాలను ఉల్లంఘించనప్పటికీ తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు పేర్కొన్నారు. కొందరు వినియోగదారులు లాగిన్ సమస్యలు ఎదుర్కొంటున్నారని డౌన్‌డిటెక్టర్ సైతం పేర్కొంది. ఐఫోన్ వినియోగదారులు ఎక్కువగా ఈ సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.