అమరావతి : రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజధానిపై ప్రభుత్వ వైఖరి
మేరకే సుప్రీం నిర్ణయం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో
మాట్లాడుతూ 3 రాజధానులపై గతంలో తెస్తామని చెప్పిన బిల్లును వెనక్కి
తీసుకున్నట్లు చెప్పారు. లేని చట్టంపై గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.
శాసనరాజధాని అమరావతిలోనే ఉంటుందన్నారు. 3 రాజధానులకు రాష్ట్ర ప్రభుత్వం
కట్టుబడి ఉందన్నారు. రాజధాని అమరావతి పూర్తి కావాలంటే రూ.లక్ష కోట్లు అవసరమని
పేర్కొన్నారు. అమరావతిలో పెట్టిన పెట్టుబడులు వృథా కాకుండా ప్రభుత్వం అన్ని
చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇవాళ్టికి రాష్ట్ర రాజధాని అమరావతే
అని.. త్వరలోనే న్యాయ ప్రక్రియకు లోబడి 3 రాజధానులపై చట్టం తీసుకొస్తామని
వెల్లడించారు. ఈ విషయంలో కోర్టులు ఎలా వ్యవహరిస్తాయో చూసి చట్టం విషయమై
ముందుకెళ్తామన్నారు. వివేకా హత్య కేసులో బాధితులకు న్యాయం జరగాలని సీఎం జగన్
కుటుంబం కోరుకుంటోందని సజ్జల అన్నారు. రాష్ట్రంలో పారదర్శక విచారణ జరగడం లేదని
వారంటున్నారని.. విచారణ ఎక్కడ జరిగినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
వివేకా హత్య కేసు నిందితులకు శిక్ష పడాలన్నదే తమ కోరిక అని వెల్లడించారు.
అయితే, వివేకా హత్య కేసులో జగన్ ఉన్నారని కుట్రదారులు చూపించే ప్రయత్నం
చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లో షర్మిల పట్ల జరిగిన ఘటన వ్యక్తిగతంగా
తనకు బాధ కలిగించిందన్నారు.