ఆ తర్వాత మా అబ్బాయి పోటీ చేస్తాడు: బాలినేని
ఒంగోలు నియోజకవర్గ పరిధిలో పేదల ఇళ్ల స్థలాలకు నిధుల మంజూరు
తాడేపల్లి నుంచి తిరిగొచ్చిన బాలినేనికి ఒంగోలులో ఘనస్వాగతం
సీఎం చేతుల మీదుగా పేదలకు పట్టాలు పంపిణీ చేస్తామన్న బాలినేని
ఒంగోలు : ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పేదల ఇంటి స్థలాలకు నిధులు మంజూరు చేయించుకుని తాడేపల్లి నుంచి తిరిగొచ్చిన వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలినేని ప్రసంగించారు. పేదలకు ఇంటి స్థలాల కోసం ఎన్ అగ్రహారం, వెంగముక్కలపాలెం ప్రాంతాల్లో భూసేకరణ చేస్తున్నామని, దీనికోసం ప్రభుత్వం నుంచి గతంలో రూ.30 కోట్లు మంజూరయ్యాయని, తాజాగా ప్రభుత్వం మరో రూ.180 కోట్లు విడుదల చేసిందని వెల్లడించారు. ఫిబ్రవరి 10వ తేదీ లోపు పాతిక వేల మంది పేదలకు సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాలు అందజేస్తామని బాలినేని చెప్పారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అని బాలినేని స్పష్టం చేశారు. ఆ తర్వాత తన కుమారుడు (ప్రణీత్ రెడ్డి) ఎన్నికల బరిలో దిగుతాడని వెల్లడించారు. అటు, ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో చర్చలు జరుగుతున్నాయని వివరించారు. ప్రస్తుతం ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డి ఉన్నారు. ఆయనకు ఈసారి వైసీపీ టికెట్ లభించకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.