తిరుగులేని విజయాలకు ఇస్రో పెట్టింది పేరు. ఆగస్టు 15,1969న ప్రారంభమైన ఇస్రో
ప్రయాణం వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రపంచ
అంతరిక్ష యవనికపై తనదైన సత్తా చాటుతూ భారతకీర్తిని విశ్వవ్యాప్తం చేస్తోంది.
ఇప్పుడు చంద్రయాన్-3తో మరింత ఖ్యాతిని తెచ్చిపెట్టేందుకు సిద్ధమైంది. ఒక్కో
ఉపగ్రహం ప్రయోగించే స్థాయి నుంచి నేడు ఏక కాలంలో పదుల సంఖ్యల ఉపగ్రహాలు
అంతరిక్షంలోకి పంపించే స్థాయికి ఎదిగింది ఇస్రో. ప్రపంచ దేశాలకన్నా ఆలస్యంగా
పరిశోధనలు ప్రారంభమైనా వాటి కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. ఇలా ఒకటా..
రెండా.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కీర్తిని చాటిచెప్పడానికి అనేక అంశాలు
ఉన్నాయి. మరి ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో స్థానమెంత? ఇతర దేశాల
ప్రయోగాలకు భారత్‌కు ఉన్న వ్యత్యాసమేంటి.? ముఖ్యంగా ఇన్‌స్పేస్
లక్ష్యాలేంటి.?.
రూ.613 కోట్లతో ‘చంద్రయాన్-3’
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగానికి కౌంట్‌డౌన్
ప్రారంభమైంది. జులై 14న మధ్యాహ్నం 2 గంటల 35 నిముషాలకు ఈ ఉపగ్రహం నింగిలోకి
దూసుకెళ్లనుంది.
చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపడుతున్న చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం
సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లో
(షార్) ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం
2:35:13 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం-3పీ4 రాకెట్ నింగిలోకి
దూసుకువెళ్లనుంది. గురువారం 2:35:13 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
ప్రయోగాన్ని పర్యవేక్షించేందుకు ఇస్రో అధిపతి డా. సోమనాథ్ షార్కు
చేరుకున్నారు. భాస్కరా అతిథి భవనంలో శాస్త్రవేత్తలతో సమీక్షా సమావేశం
నిర్వహించారు. ఈ సమీక్షలో చంద్రయాన్-3 ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్
వీరముత్తువేల్, ఎల్వీఎం-3పీ4 మిషన్ డైరెక్టర్ ఎస్. మోహన్‌కుమార్, అసోసియేట్
మిషన్ డైరెక్టర్ నారాయణ్, వెహికిల్ డైరెక్టర్ బిజూస్ థామస్ పాల్గొన్నారు.