కక్ష్యలోకి చేరిన 36 ఉపగ్రహాలు
షార్ నుంచి ఉదయం 9 గంటలకు ప్రయోగం
20 నిమిషాల ప్రయాణించి శాటిలైట్లను కక్ష్యలోకి చేర్చిన ఎల్వీఎం-3 రాకెట్
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన రాకెట్ ప్రయోగం
విజయవంతమైంది. ఇస్రో పంపిన 36 ఉపగ్రహాలను ఎల్వీఎం-3 రాకెట్ కక్ష్యలోకి
చేర్చింది. రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. ఆదివారం ఉదయం
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్) లో ఎల్వీఎం-3
రాకెట్ ప్రయోగం జరిగింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు షార్ ప్రయోగ వేదిక
నుంచి ఎల్వీఎం-3 రాకెట్ నింగిలోకి ప్రయాణం ప్రారంభించింది. వన్ వెబ్ కు చెందిన
మొత్తం 36 ఉపగ్రహాలతో బయల్దేరింది. దాదాపు 20 నిమిషాల ప్రయాణం తర్వాత భూమి
ఉపరితలం నుంచి 450 కి.మి. చేరుకుంది. మోసుకెళ్లిన ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా
లియో ఆర్బిటల్ వృత్తాకార కక్ష్యలోకి రాకెట్ ప్రవేశపెట్టింది. కాగా, ఎల్వీఎం-3
ఎం-3 రాకేట్ ఎత్తు 43.5 మీటర్లు. బరువు 643 టన్నులు. 36 ఉపగ్రహాల బరువు 5805
కిలోలు. రాకెట్ మోసుకెళ్లిన ఉపగ్రహాల బరువు 5.8 టన్నులు. ఇస్రోకు చెందిన న్యూ
స్పేస్ ఇండియా లిమిటెడ్, వన్ వెబ్ ల మధ్య మొత్తం 72 ఉపగ్రహాలను నింగిలోకి
చేర్చేందుకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా గతేడాది అక్టోబరు 23న మొదటి 36
ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చింది. తాజా ప్రయోగంలో మిగతా 36 ఉపగ్రహాలను
కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.