అర్హులైన రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను జూన్ 26 నుంచి జమ చేయనున్నట్లు
రాష్ట్ర సర్కార్ వెల్లడించింది. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని
నిర్ణయించింది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎప్పటిలాగానే వరుస
క్రమంలో అన్నదాతాల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. తక్కువ
విస్తీర్ణం ఉన్న వారితో ప్రారంభించి రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని వారి
బ్యాంకుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఈసారి పోడు రైతులకూ రైతుబంధు
అలాగే త్వరలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్
నిర్ణయం తీసుకున్నారు. పట్టాల పంపిణీ అనంతరం పోడు రైతులకూ రైతుబంధు సాయం
అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈసారి పోడు
రైతులకూ రైతుబంధు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ
మంత్రి హరీశ్‌రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సీఎం అదేశాలు
జారీ చేశారు. ఈ సీజన్లో పంట పెట్టుబడి సాయం కింద రైతులకు 7500 కోట్ల రూపాయలకు
పైగా సాయం అందించనున్నారు. పోడు పట్టాల పంపిణీ అనంతరం సాయం మొత్తం పెరగనుంది.
రైతు బంధు ఎప్పుడు ప్రారంభించారంటే
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు, రైతుల ఆదాయం సమకూర్చేందుకు,
అప్పుల ఊబిలో అన్నదాతలు కూరిపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి
2018- 19 ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం(రైతు బంధు) అమలు
చేయాలని ప్రతిపాదించింది. ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా
చర్చనీయాంశమైంది. ప్రతి సీజన్లో రైతుకు ఎకరానికి రూ.5 వేలు వారి ఖాతాలో
వేస్తుంది. ఇప్పటి వరకు10 విడతలుగా రాష్ట్రంలో ఉండే రైతులకు రూ.65 వేల కోట్లు
ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కరోనా సమయంలోను కొనసాగిన రైతు బంధు
రైతు బంధు పథకాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలు
ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో కర్షకులకు ప్రతి విడతలో కచ్చితంగా నగదు జమా
అయ్యేట్టు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కరోనా సమయంలోను రైతు బంధు
పథకం నిలిపి వేయలేదు. ఈ పథకం వల్ల రాష్ట్రంలో రైతులకు కొంత వరకు ఆర్ధిక భారం
తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. కష్ట కాలంలో రైతులను ఆదుకోని.. ఎన్ని
విమర్శలు వచ్చినా విజయవంతంగా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది.