ఫ్యామిలీ డాక్టర్ విధానం పై వైద్య సిబ్బందికి శిక్షణ
ఎకో ఇండియా సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ
వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు
విజయవాడ : ఎకో ఇండియా సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ చేసుకున్నట్లు వైద్య ఆరోగ్య
శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. ఎకో ప్రాజెక్ట్ ద్వారా రోగులకు
మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఈ సంస్ధ పలు వైద్య కార్యక్రమాలపై వైద్య
సిబ్బందికి శిక్షణ ఇస్తుందన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని విజయవంతం
చేయడానికి వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తామని, ప్రతీ ఆరు నెలలకి ఒకసారి శిక్షణా
కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. గర్బిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు,
బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకి వైద్య సేవలు పకడ్బందీగా నిర్వహించేలా
శిక్షణ ఉంటుందన్నారు. ఈ ఎంవోయూ ద్వారా ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి భారం పడదు.
మొత్తం ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి ఈ సంస్ధ ముందుకు వచ్చింది. హెల్త్ కేర్
రంగంలో నిరంతర శిక్షణ చాలా ఉపయోగపడుతుందని మా భావన. ఐదు మెడికల్ కళాశాలను ఈ
ఏడాది ప్రారంభించబోతున్నాం. ఇప్పటికే విజయనగరం కళాశాలకి అనుమతులు వచ్చాయి.
మిగిలిన నాలుగు కళాశాలలు దాదాపు 85 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు.
కాకినాడలో ఇద్దరు కోవిడ్ వల్ల మృతి చెందినట్లు వార్తలు మీడియాలో వచ్చాయి.
కోవిడ్ పాజిటివ్ వల్ల చనిపోయారా, ఇతర కారణాలు వల్ల చనిపోయారా అన్నది
పరిశీలించాలని వైద్య శాఖ అధికారులని ఆదేశించాం. కోవిడ్ వల్ల మరణించినట్లు ఇంకా
నిర్దారణ కాలేదు. ఏపీకి 20 లక్షల డోసులు కావాలని కేంద్రాన్ని కోరాం. ఏపీతో
పాటు అన్ని రాష్ట్రాలకి కేంద్రం పంపించాల్సి ఉంది. జాతీయ రహదారుల పక్కనే 13
ట్రామా కేర్ సదుపాయాలు ఏర్పాటు చేశామని కృష్ణబాబు వెల్లడించారు.