ఈశ్వర్
జగిత్యాల : జగిత్యాల జిల్లాలో ఈనెల 7వ తేదీన సిఎం కెసిఆర్ పర్యటన నేపథ్యంలో
ప్రభుత్వ శాఖలు తమకు అప్పగించిన బాధ్యతలను చిత్త శుద్దితో నిర్వర్తించాలని
మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటనకు సంబంధించి జగిత్యాల
జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హల్లో మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ లు
జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ వసంత, స్థానిక శాసన సభ్యులు డాక్టర్ సంజయ్
కుమార్, జిల్లా కలెక్టర్ జి.రవి, ఎస్పీ సింధు శర్మలతో కలిసి ఏర్పాట్ల పై
ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు పటిష్ట
భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
సిఎం పర్యటన పూర్తి అయ్యే వరకూ విద్యుత్ అంతరాయం లేకుండా ట్రాన్స్ కో
అధికారులు చూడాలన్నారు. కార్యక్రమం కు హాజరయ్యే ప్రజా ప్రతినిధులకు సంబంధిత
శాఖల జిల్లా అధికారులకు సకాలంలో పాస్ లు అందజేయాలని సూచించారు. అలాగే
అగ్నిమాపక శాఖ అగ్నిమాపక శకటాలను సిద్దంగా ఉంచాలన్నారు. సిఎం పర్యటన కు
అంబులెన్స్ ను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందుబాటులో ఉంచాలని అన్నారు.
ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ అరేంజ్మెంట్ లు రెవెన్యూ అధికారులు చూడాలన్నారు.
ఇంకా ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్
రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్ర శేఖర్ గౌడ్, జిల్లా అదనపు
కలెక్టర్ లు మందా మకరంద్, బిఎస్ లత, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు
పాల్గొన్నారు. సమీక్షా సమావేశానికి ముందు మంత్రులు హరీష్ రావు, కొప్పుల
ఈశ్వర్, గంగుల కమలాకర్ లు మోతె సభస్థలిని సందర్శించి బహిరంగ సభ ఏర్పాట్లను
పరిశీలించారు.
వాహనాల రాకపోకల మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.