ముందస్తు ఎన్నికల సంకేతాలు కనిపిస్తున్నాయి
డబ్బు తీసుకుని సీట్లు ఇచ్చే సంస్కృతి జనసేనలో లేదు
జనసేన అధినేత పవన్ కల్యాణ్
గుంటూరు : ఎన్నికల ఏడాదిలో అడుగు పెడుతున్నాం..ముందస్తు ఎన్నికల సంకేతాలు
కనిపిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ
కేంద్ర కార్యాలయంలో జనసేన క్రియాశీలక నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ తాజా పరిణామాలు చూస్తుంటే ముందస్తు ఎన్నికలు
రావొచ్చనిపిస్తోందన్నారు. డబ్బు తీసుకుని సీట్లు ఇచ్చే సంస్కృతి జనసేనలో
లేదు. సామాన్యుడిని రాజకీయాల్లోకి రానివ్వకూడదని వైకాపా భావిస్తోంది. వైసీపీ
దృష్టిలో రాజకీయం అంటే భయపెట్టడం, బెదిరించడమే. జనసేన నేతలకు త్యాగం, బాధ్యత
జవాబుదారీతనం ఉండాలి. జనాల్ని దోచుకునే నేతలు కాదు, తమ సొమ్మును పంచే నేతలు
కావాలి. డబ్బుతో ఓట్లు కొనమని నేను చెప్పడం లేదు. కానీ, నాయకులు కావాలంటే
ఖర్చు పెట్టి తీరాలి.. తప్పదు. రూపాయి ఖర్చు చేయకుండా ఎవరూ నాయకులు కాలేరు.
వచ్చే 25 ఏళ్ల గురించి ఆలోచించే నేతలు కావాలి. భావితరం గురించి ఆలోచించే నేతలు
వేరే పార్టీల నుంచి వస్తే ఆహ్వానిస్తాం. మంచి వారినే పార్టీలోకి
ఆహ్వానిస్తున్నాం.. అలాంటి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు’’ అని పార్టీ
నేతలకు పవన్ దిశానిర్దేశం చేశారు.
నిజాయతీగా పనిచేస్తే గుర్తింపు అదే వస్తుంది : ‘‘జగన్ పాలించడానికి అనర్హుడు.
అటువంటి వ్యక్తిని గద్దె దించాలి. దిష్టి బొమ్మను ఊరేగిస్తే మన వాళ్లపై
క్రిమినల్ కేసులు పెట్టారు. బీజేపీ నాయకులపై పోలీసులు దాడి చేస్తే నేను
స్పందించా. జనసేన నాయకులపై దాడి జరిగితే కనీసం స్పందించరా? ఎన్డీయే సమావేశంలో
మనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూశారు. నిజాయతీగా పని చేస్తే గుర్తింపు అదే
వస్తుంది. ఎన్నో తట్టుకుని ప్రజల కోసం నేను నిలబడ్డా. ఒక్కసారి మాట ఇస్తే కంఠం
తెగి పడే వరకు అలాగే ఉంటా. భవిష్యత్తులో జనసేన ప్రభుత్వం తప్పకుండా ఏర్పాటు
చేస్తాం. నా దేశం కోసం పని చేస్తున్నా అని అనుకోవాలి. జగన్, ఆయన అనుచరులు
మానవవనరులను దోపిడీ చేస్తున్నారు. వాటిపై అందరం కలిసి పోరాటం చేయాలని పవన్
పిలుపునిచ్చారు.
నన్ను తిట్టారని మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు : ఇది మన జనసేన కేంద్ర
కార్యాలయం. భవన నిర్మాణం పూర్తి అయితే కార్యకలాపాలు ఇక్కడి నుంచే ఉంటాయి.
కార్యాలయం వెనక చిన్న నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉంటా. మంగళగిరిలోని
జనసేన కార్యాలయమే నా ఇల్లు. ప్రజలకు చేరువగా ఉంటూనే వారిని మీ ఓటర్లుగా
మార్చుకోవాలి. 2019 మాదిరిగా కాకుండా సరికొత్త విధానంలో అభ్యర్థుల ఎంపిక
ఉంటుంది. స్థానిక అంశాలు, అభిప్రాయాలు, సర్వే నివేదికల ఆధారంగా సీట్ల
కేటాయింపు ఉంటుంది. ప్రజల వ్యక్తిగత డేటా ప్రైవేటు సంస్థల చేతికి వెళ్లింది.
విశాఖ వారాహి యాత్రతో మరింత బలంగా జనసేన దూసుకెళ్తోంది. అక్కడి దోపిడీ,
దౌర్జన్యాలను ప్రజలకు వివరిస్తాం. విశాఖ జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా
రాకుండా చేద్దాం. డిబేట్స్‌లో అంశాల వారీగా గట్టిగా సమాధానం చెప్పండి.
పొలిటికల్ డిబేట్స్‌ను తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు.
నన్ను తిట్టారని మీరు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. మన జనసేనకు భాష
ముఖ్యం. విధానాలపై ప్రశ్నించండని కోరారు.
నా సినిమాను నేనే వదిలేశా.. మీరు ఆవేశపడొద్దు : నా సినిమాను నేనే వదిలేశా.
మీరు ఎందుకు ఆవేశపడతారు? కావాలని చేసే కుట్రలో మీరు చిక్కుకోవద్దు. జనసేన
నాయకుల స్థాయి పెరగాలి. వాళ్ల స్థాయికి మీరు దిగజారొద్దు. నన్ను తిడితే నా
శరీరంలో చిల్లులు పడిపోవు కదా. మనం ఏది మాట్లాడినా రాష్ట్రం, ప్రజల కోసం అనేలా
ఉండాలి. మూడో విడత వారాహి యాత్రకు అందరూ సిద్ధం కండి. జగన్ దుర్మార్గపు పాలనను
తరిమికొట్టాలి. జనసేనను అధికారంలోకి తేవాలి. ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి
ప్రజలు సిద్ధంగా ఉన్నారని పవన్ పేర్కొన్నారు.