భారతదేశం అందించిన ఒక గొప్ప వరం యోగా. ఇది మనస్సును, శరీరాన్ని ఏకం చేసి
రెండింటి మధ్య సమన్వయం తీసుకురాగల ఒక అద్వితీయమైన అభ్యాసం. యోగా అనేది
ఆరోగ్యకరమైన జీవనానికి సంబంధించిన కళ. ఇది మీకు వ్యాయామాలకు మించిన
శక్తివంతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పురాతన శాస్త్రంలో అనేకమైన ఆసనాలు
ఉన్నాయి. యోగాసనాలను సాధన చేయడం ద్వారా మీరు అనేక శారీరక, మానసిక ఆరోగ్య
ప్రయోజనాలను పొందవచ్చు.
నేడు ఎంతోమంది మధుమేహంతో బాధపడుతున్నారు. సాధారణంగా మనం తినే ఆహారం గ్లూకోజ్
విడిపోయి రక్తప్రవాహంలో విడుదలవుతుంది. ఇది మనం రోజువారీగా అనేక పనులను
చేయడానికి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. అయితే, మధుమేహం ఉన్నప్పుడు
రక్తంలో పెద్ద మొత్తంలో గ్లూకోజ్ విడుదలవుతుంది, ఈ పరిస్థితినే హైపర్
గ్లైసీమియా అని కూడా అంటారు. ఇది శరీరానికి పెద్ద సమస్యగా మారుతుంది. ఆ తర్వాత
అనేక వ్యాధులకు కారణమవుతుంది, అవయవాలను దెబ్బతీస్తుంది. అయితే ఈ పరిస్థితిని
నియంత్రించడంలో యోగా సహాయపడుతుంది.
*రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచే యోగా ఆసనాలు:
*మండూకాసనం:
ఈ ఆసనం కడుపు సమస్యలను తగ్గించడంలో, మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఇది ఉదర అవయవాలను టోన్ చేయడంలో కూడా సహాయపడుతుంది.
*కుర్పర దండాసనం:
ఈ ఆసనం జీర్ణ అవయవాల పనితీరును పెంచడంలో సహాయపడుతుంది. వెన్ను, తుంటి గాయాల
నుంచి ఉపశమనం అందిస్తుంది.
*పాద అంగుష్టాసనం:
ఇది మెదడును శాంతపరచడంలో, స్నాయువులను సాగదీయడంలో, తొడ కండరాలను బలోపేతం
చేయడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, నిద్రలేమి లక్షణాల
నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది.
*పశ్చిమోత్తనాసనం:
ఈ ఆసనం వెన్నెముక కదలికకు సహాయపడటమే కాకుండా శరీరానికి ఫ్లెక్సిబిలిటీని
పెంచడంలో సహాయపడుతుంది.
మీ శరీరంలోని అంతర్గత అవయవాలు యోగా ఆసనాల ద్వారా సాగదీయబడతాయి. వాటికి మసాజ్
చేసినట్లుగా అవుతుంది. పైన పేర్కొన్న నాలుగు భంగిమలను క్రమం తప్పకుండా సాధన
చేయడం వల్ల అవయవాలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. వాటి కార్యాచరణ,
సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇలా మీ ఆరోగ్యానికి చాలా విధాలుగా
ప్రయోజనం చేకూరుస్తుంది అని యోగా నిపుణులు పేర్కొన్నారు.