రాజ్యసభలో విజయ సాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ జవాబు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమగ్ర జాతీయ డేటా బేస్ తయారు చేసే లక్ష్యంతో రూపొందించిన ఈ-శ్రమ్ పోర్టల్‌లో 2024 జనవరి 31 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి 80 లక్షల మంది కార్మికులు రిజిస్టర్ చేసుకున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఆంధ్రప్రదేశ్ నుంచి 1.5 కోట్ల మంది అసంఘటిత కార్మికులను నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. 2021 ఆగస్టు 26న ప్రారంభించిన ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా కార్మికుల ఆధార్ వివరాలను సీడింగ్ చేసి వారికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)ను జారీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ-శ్రమ్ పోర్టల్‌ను నేషనల్ సర్వీస్ పోర్టల్ (ఎన్ఎస్పీ)తో జోడించి తద్వారా కార్మికులు తమ యూనివర్శల్ అకౌంట్ నంబర్‌తో ఎన్ఎస్పిలో రిజిస్టర్ చేసుకొని దేశవ్యాప్తంగా తమకు అనువైన ఉపాధి అవకాశాలను వెతుక్కోవచ్చని మంత్రి తెలిపారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్టర్ అయిన కార్మికులు అందులోని లింక్/ ఆప్షన్ ద్వారా ఎన్ఎస్పిలో సులువుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పెన్షన్ స్కీంతో అనుసంధానం చేసినట్లు శ్రీ తెలీ పేర్కొన్నారు. తద్వారా 18 నుంచి 40 ఏళ్ల వయస్సుగల అసంఘటిత కార్మికులు పెన్షన్‌కు అర్హత పొందుతారని ఆయన తెలిపారు. అసంఘటిత కార్మికులు తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్‌తో మాన్ ధన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. వృత్తి నైపుణ్యం మెరుగుపరుచుకునేందుకు, అప్రెంటిస్ పొందేందుకు స్కిల్ ఇండియా డిజిటల్ పోర్టల్‌తో కూడా అనుసంధానం చేసినట్లు మంత్రి వెల్లడించారు.
అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకేచోట లభ్యమయ్యేలా ఈ-శ్రమ్ పోర్టల్‌ను మై-స్కీం పోర్టల్‌తో జోడించడం జరిగింది తెలిపారు. వివిధ పథకాలకు సంబంధించి అర్హత, నమోదు చేసుకునే విధానం పోర్టల్‌లో సవివరంగా పొందుపరిచినట్లు మంత్రి తెలిపారు. ఈ-శ్రమ్ పోర్టల్‌పై అసంఘటిత కార్మికుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు, ప్రసార, సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ (ఐఈసీ) కార్యక్రమాలు, ఈ-శ్రమ్ పోర్టల్‌పై అవగాహన పెంచేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులు కూడా ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.