ఉక్రెయిన్ అమెరికాపై ఒత్తిడి తీసుకురావడంతో వారు ఉక్రెయిన్ దేశానికి క్లస్టర్
బాంబులను పంపించనున్నట్లు ప్రకటించింది. క్లస్టర్ బాంబులు తీవ్రస్థాయిలో
ప్రాణనష్టం చేకూరుస్తాయని తెలిసి కూడా అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ఆ దేశ
అధ్యక్షుడు జో బైడెన్ సమర్ధించుకున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై
ఒకటిన్నర సంవత్సరం పూర్తి కావస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం,
భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. ఇంకా జరుగుతూ ఉంది. సుదీర్ఘ కాలంగా యుద్ధం
చేస్తోన్న నేపథ్యంలో ఉక్రెయిన్ వద్ద ఆయుధ నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి. అందుకే
అగ్రరాజ్యాన్ని సాయం కోరుతూ ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీ జో
బైడెన్ పై ఒత్తిడి చేశారు. దీంతో చాలాకాలంగా వారి ఆయుధ కర్మాగారంలో నిల్వ
ఉండిపోయిన క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్‌కు పంపించాలన్న నిర్ణయానికి వచ్చింది
అగ్ర రాజ్యం. ఈ నిర్ణయాన్ని పలు మానవ హక్కుల సంఘాలు, డెమొక్రాట్లు తప్పుబట్టిన
కూడా జో బైడెన్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు.
క్లస్టర్ బాంబుల తీవ్రత గురించి తెలుసు. అందుకే ఇన్నాళ్లు వాటిని ఉక్రెయిన్‌కు
పంపలేదు. కానీ ఇప్పుడు వారి వద్ద ఆయుధ నిల్వలు బాగా తగ్గిపోయాయి. ఈ సమయంలో
వారిని అలా వదిలేయలేము. నాటో మిత్రదేశాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం
తీసుకున్నామని ఆయన అన్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సుల్లివాన్
ఈ విషయంపై స్పందిస్తూ సాధారాణ ఆయుధాలతో పోలిస్తే ఈ క్లస్టర్ బాంబులు పెను
విధ్వాంసాన్ని సృష్టిస్తాయి. వీటి కారణంగా భారీగా ప్రాణనష్టం జరిగినట్లు
చరిత్ర చెబుతోంది. అందుకే వీటిని ఉక్రెయిన్‌కు పంపే విషయమై తీవ్ర జాప్యం
చేశామని అన్నారు. ఆయుధాలు కొరవడిన సమయంలో మిత్రదేశాన్ని అలా వదిలేయకూడదని బాగా
ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు.
క్లస్టర్ బాంబుల ప్రత్యేకత ఏంటి ? : ఒక క్లస్టర్ బాంబు అంటే అది అనేక బాంబుల
సముదాయం. దాన్ని ఒక రాకెట్ ద్వారా గానీ ఫిరంగుల ద్వారా గానీ ఈ క్లస్టర్
బాంబును సంధిస్తే సుమారు 24-32 కిలోమీటర్ల దూరాన ఉన్న లక్ష్యాన్ని కూడా
తునాతునకలు చేయవచ్చు. ఒక్కటే బాంబుగా రిలీజైన ఈ క్లస్టర్ గాల్లో చిన్న చిన్న
బాంబులుగా విడిపోయి అక్కడక్కడా చెదురుముదురుగా పడి పేలతాయి. కాబట్టే వీటివలన
భారీగా ప్రాణనష్టం కూడా వాటిల్లుతుంది. పైగా ఇవి నేల మీద పడిన వెంటనే
విస్ఫోటం చెందవు. కొన్ని అప్పుడే పేలగా కొన్ని మాత్రం ఎప్పుడో పేలుతుంటాయి.
అందుకే ఐక్యరాజ్యసమితి 2008లో ఈ క్లస్టర్ బాంబుల వాడకాన్ని నిషేధిస్తూ ఒక
తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బ్రిటన్, ఫ్రాన్స్ సహా 120 దేశాలు వీటి
వినియోగాన్ని నిషేధిస్తూ సంతకాలు కూడా చేశాయి. 2003లో ఇరాక్ పై చేసిన యుద్ధంలో
అమెరికా ఈ క్లస్టర్ బాంబులనే అధికంగా ప్రయోగించింది. అటు తర్వాత అమెరికా
వాటిని మళ్ళీ ఎక్కడా ఉపయోగించలేదు. అందుకే వారి వద్ద లక్షల సంఖ్యలో క్లస్టర్
బాంబుల నిల్వ ఉండిపోయింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు సాయం చేస్తూ నిల్వలను
తగ్గించుకుంటోందని అమెరికా చెబుతుంటే.. అందులో రష్యాపై గెలవాలన్న వారి కాంక్షే
కనిపిస్తోందని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు.