ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో కీవ్ సహా చాలా నగరాల్లో విద్యుత్తు సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి.
ఇంటర్నెట్‌డెస్క్: నల్లసముద్రంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు ప్రతిగా నేడు రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ దేశ వ్యాప్తంగా పలు నగరాలపై రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో కీలకమైన మౌలిక సదుపాయల వ్యవస్థలు దెబ్బతిన్నాయి. కీవ్‌లోనే రెండు భారీ పేలుళ్లు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలోని చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఖర్కీవ్‌లోని ముఖ్యమైన మౌలిక వసతి భవనాలు దెబ్బతిన్నట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. కీవ్‌లోని విద్యుత్తు కేంద్రం ఒకటి ఈ క్షిపణి దాడిలో దెబ్బతింది. దీంతో 3.5 లక్షల అపార్ట్మెంట్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని నగర మేయర్ కూడా ధ్రువీకరించారు. విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించడానికి యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ల్వీవ్, జపొరిజియా, డెనిప్రోపెట్రోవస్క్ నగరాలపై కూడా దాడులు జరిగాయి. నీపర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్‌పై ఈ దాడి జరిగినట్లు సమాచారం వెలువడింది.
స్ట్రాటిజిక్ బాంబర్లను వాడిన రష్యా..!:రష్యా ఈ దాడులకు స్ట్రాటిజిక్ బాంబర్లను వినియోగించినట్లు ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ ప్రతినిధి పేర్కొన్నారు. రష్యా ప్రయోగించిన చాలా క్షిపణులను తాము కూల్చి వేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి దిమిత్రి కులేబా మాట్లాడుతూ రష్యన్లు యుద్ధ రంగంలో పోరాడకుండా ప్రజలపై దాడులు చేస్తున్నారన్నారు. రష్యా దాడుల కారణంగా తాము కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చిందని అమెరికా రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. క్రిమియాలోని కీలకమైన సెవస్తపోల్ సైనిక నౌకాస్థావరంపై శనివారం ఉక్రెయిన్ 16 డ్రోన్లతో విరుచుకుపడింది. శత్రువుకు భారీ నష్టం కలిగించింది. కీలకమైన యుద్ధనౌకలను ధ్వంసం చేసింది. రష్యా మాత్రం.. దాడులను తిప్పికొట్టామని, డ్రోన్లన్నింటినీ నేలకూల్చామని పేర్కొంది. ఓ యుద్ధనౌకకు మాత్రమే నష్టం వాటిల్లిందని తెలిపింది. సెవస్తపోల్.. నల్లసముద్రంలో రష్యా నౌకాదళానికి ప్రధాన కేంద్రం. ఇక్కడి నుంచి అటు అజోవ్ సముద్ర తీరాన్ని ఇటు నల్ల సముద్ర తీరాన్ని మాస్కో నియంత్రిస్తోంది