విజయవాడ : రాష్ట్రంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పధకంలో భాగంగా పేదలకు
ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్ళ నిర్మాణాలు ఉగాది నాటికి రాష్ట్రంలో ఐదు లక్షల
ఇళ్ళు నిర్మాణాలు పూర్తీ కావాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
స్పష్టం చేశారు. వచ్చే ఉగాది రోజు ఐదు లక్షలమంది లబ్దిదారులు గృహ ప్రవేశాలు
జరుపుకోవడం ద్వారా 20 లక్షల మంది వారి కుటుంబ సభ్యులు ఆనందంగా ఉగాది పండుగ
జరుపుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. బుధవారం మంత్రి విజయవాడలోని గృహనిర్మాణ
సంస్థ ప్రధాన కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం
నిర్వహించేరు. ఈ సమావేశంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యెక ప్రధాన కార్యదర్శి
అజేయ్ జైన్, గృహనిర్మాణ సంస్థ ప్రత్యెక కార్యదర్శి బీ.ఎం.మైదీన్, గృహనిర్మాణ
సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లక్షిషా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం.శివ
ప్రసాద్,26 జిల్లాల గృహనిర్మాణ శాఖ జిల్లా హెడ్ లు పాల్గొన్నారు. వీరితో పాటు
వీడియో కాన్ఫరెన్సు ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పనిచేస్తున్న
గృహనిర్మాణ శాఖకు చెందిన ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి జోగి.రమేష్ మాట్లాడుతూ ప్రతీ
జిల్లాలోను లక్ష్యాలను నిర్దేశించుకొని నూటికి నూరు శాతం ఇళ్ళ నిర్మాణాలను
పూర్తీ చేయాలని ఆదేశించారు. ఒకే రోజు ఐదు లక్షల ఇళ్ళలో గృహ ప్రవేశాలు
జరపడంద్వారా దేశంలోనే ఒక ప్రత్యేకతను సాధించాలని,ఈ లక్ష్య సాధనకు ప్రతీ
ఉద్యోగి నిరంతరం కృషి చేయాలని మంత్రి దిశా నిర్దేశం చేసేరు.ఈ మహా యజ్ఞంలో బాగా
పనిచేసిన వారికి ముఖ్యమంత్రి పాల్గొనే సభలో అవార్డులతో సత్కరిస్తామని,పేద
ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో శ్రద్ధ వహించాలని
మంత్రి సూచించేరు. అదేవిధంగా విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే క్రమశిక్షణ
చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేసేరు.
రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యెక ప్రధాన కార్యదర్శి అజేయ్ జైన్ మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణాల పూర్తీ చేయటానికి అధిక ప్రాధాన్యత
ఇస్తోందని,ప్రభుత్వ నిర్ణయించిన లక్ష్యాలను పూర్తీ చేయటానికి ఇంజినీరింగ్
అసిస్టెంట్ నుంచి జిల్లా కలెక్టర్ వరకూ నిరంతరం పనిచేయాలని ఆదేశించేరు.ఇళ్ళ
నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని,ఆప్షన్-3 లేఅవుట్ లలో 36
క్వాలిటీ కంట్రోల్ లాబ్స్ ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర
గృహనిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ ఇళ్ళ నిర్మాణాలు
పూర్తీ చేయడానికి అధికారులు నిరంతరం లే ఔట్లను సందర్శించాలని, గ్రామ
సచివాలయాలకు చెందినసిబ్బందితో సమన్వయం చేసుకొని పనిచేయాలని ఆదేశించేరు.