ఇంజనీరింగ్ విద్యార్థి మువ్వల నగేష్ మృతిపై అనేక అనుమానాలు
నగేష్ కుటుంబానికి పార్టీ తరఫున సాయం
టెక్కలి, పలాస నియోజక వర్గాల సమీక్ష సమావేశాల్లో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్
నాదెండ్ల మనోహర్
శ్రీకాకుళం : “మా అమ్మానాన్నను జీవితంలో ఒక్కసారి అయినా విమానం ఎక్కించాలనేది
నా జీవిత కల. మా నాన్న నా 15వ ఏట మమ్మల్ని పోషించేందుకు కుటుంబాన్ని విడిచి
అసోం రాష్ట్రం వలస వెళ్లిపోయారు. అక్కడ కూలి పనులు చేసుకుంటూ వచ్చిన దాంట్లో
తిని ఇతర డబ్బులు మాకు పంపేవారు. అయితే ఆయన వలస జీవితంలోనే చివరి శ్వాస
విడిచారు. అసోంలో ఆరోగ్యం పాడవడంతో మరణించాక కార్గోలో తీసుకు రావాల్సి
వచ్చింది. నా కలను వలస బాధ నిర్జీవం చేసింది.. నా కన్నీటికి.. మా ప్రాంత వలస
బతుకులకు అంతు లేదన్నది పలాస ప్రాంతానికి చెందిన మజ్జి భాస్కరరావు
ఆవేదన..అంతు చిక్కని ప్రశ్న. ఉత్తరాంధ్ర పర్యటన లో భాగంగా ఆదివారం శ్రీకాకుళం
జిల్లా పార్టీ ఐటీ సమావేశం లో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
ఎదుట కన్నీళ్లు ఉబికి వస్తుండగా ఆవేదన కూడిన స్వరంతో ఆ యువకుడు చెప్పిన మాటలు
మనోహర్ తో పాటు అందరినీ కదిలించాయి. సాంకేతిక విషయాలతో పాటు ఈ ప్రాంతంలోని
సమస్యల మీద మాట్లాడమని మనోహర్ ఐటీ విభాగ కార్యకర్తలను కోరారు.
క్షేత్రస్థాయిలో వారికీ ఎదురైన అనుభవాలు, ప్రస్తుత పరిస్థితి గురించి ఐటీ
విభాగ కార్యకర్తలు మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్బంగా మనోహర్ మాట్లాడుతూ “వచ్చే ఏడాది కాలం చాలా కీలకం అయ్యింది. అన్ని
మార్గాల్లోను రాజకీయ శత్రువులను ఎదుర్కొనేందుకు ఐటీ విభాగం కీలకం. పనులు
చేసుకుంటూనే పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం పని చేస్తున్న ఐటీ
కార్యకర్తలంతా మాకు పెద్ద సైన్యం. కేవలం ప్రభుత్వం మీద విమర్శలు కాకుండా,
ప్రజల కోసం జనసేన చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి. ఇతర
పార్టీలకు సాంకేతికంగా పెద్ద సైన్యం ఉన్నా, మనకు అంకితభావంతో ఒక గొప్ప లక్ష్యం
సాధించే సాయుధ సాంకేతిక సైన్యం ఉంది. కచ్చితంగా పార్టీకి సంబంధించిన అన్ని
విషయాలు, అలాగే రాజకీయ అంశాలు పట్ల పూర్తి అవగాహనతో ముందుకు వెళ్ళాలి. ప్రజలకు
నిజమైన సమాచారం అందించేలా, శత్రువు చేసే కుట్రలను తిప్పి కొట్టేలా బలంగా పని
చేయాలన్నారు.
ఉప్పు రైతుల సమస్యపై పోరాడుదాం : ఐటీ సమావేశం అనంతరం శ్రీకాకుళం జిల్లా
నియోజకవర్గ సమీక్షా సమావేశాల్లో భాగంగా టెక్కలి, పలాస నియోజకవర్గ సమావేశాలు
నిర్వహించారు. సమావేశాల్లో మనోహర్ మాట్లాడుతూ “తీర ప్రాంతంలో ఉప్పు రైతుల
సమస్య చాలా తీవ్రంగా ఉంది. రైతులకు మద్దతు గా జనసేన పోరాడుతుంది. ఈస్ట్ కోస్ట్
థర్మల్ విద్యుత్ కేంద్రం గురించి పోరాడిన నేల ఇది. భావనపాడు పోర్ట్ ఏమైందో
కూడా తెలీదు. ఏ ప్రభుత్వం వచ్చినా కేవలం పోర్ట్ నిర్మాణ వ్యయం అంచనాలు పెంచి
చోద్యం చూస్తోంది తప్పితే, కదలిక లేదు. పేదలకు ఇళ్లు ఇస్తాం అని చెప్పిన
వైసీపీ ప్రభుత్వం పేదలకు వివరాలు కూడా లేని పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకుంది.
ఇంటి స్థలాలు విషయంలో అంతు లేని అవినీతి జరిగింది. వాటిపై జనసేన నాయకుల చేసిన
పోరాటం వల్లనే నిజాలు తెలిశాయి. ఇక్కడి ప్రజానీకం ముందు చూపు గొప్పది.
పదిమందికి మేలు చేయాలనే వారి మనసు అద్భుతం. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న ఈ
ప్రభుత్వం మీద పోరాడాల్సిన అవసరం ఎంత అయినా ఉంది. నేను ఇప్పుడు జనసేన కోసం పని
చేస్తే నా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించే గొప్ప మనుషులు ఇక్కడ
ఉన్నారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధికి ఒక న్యాయవాది : ఈ ప్రభుత్వం చేస్తున్న
దాష్టికాలు గురించి తెగించి పోరాడండి. ప్రజా సమస్యలపై ప్రజా క్షేత్రం లోనే
పోరాడాలి. ఎంత మంది పై కేసులు పెడతారో పెట్టుకోమని చెప్పండి. కచ్చితంగా ప్రతి
పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ నుంచి ఒక న్యాయవాది ఉండేలా పవన్ కళ్యాణ్
చూస్తారు. మీ వెనుక పార్టీ న్యాయ విభాగం బాసటగా నిలుస్తుంది. ఎక్కడ భయపడాల్సిన
అవసరం లేదు. అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.
మానవత్వం లేని మనుషులకు పదవులు ఎందుకు? : మానవత్వం లేని మనుషులకు పదవులు అవసరం
లేదు. స్పందించే హృదయం లేని వ్యక్తులకు ప్రజా అందలాలు అక్కర్లేదు. 2021, జనవరి
26వ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం
నువ్వుల రేవు గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి మువ్వల నగేష్
పోస్టుమార్టం రిపోర్టు ఇప్పటివరకు ఇవ్వకపోవడం దారుణం. అన్ని విధాలా సహాయం
చేస్తానని చెప్పిన నాయకుడు కనీసం బాధిత కుటుంబాన్ని పట్టించుకోకపోవడం దారుణం.
నగేష్ మృతి మీద అనేక రకాల ఆరోపణలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నా
పోలీసులు కనీస దర్యాప్తు చేయకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
విద్యార్థి మృతిపై ఇప్పటికైనా నిజానిజాలు వెలికి తీయాలి. తన కొడుకు ఎలా
చనిపోయాడో చెప్పాలని వేడుకుంటున్న నగేష్ తల్లి శ్రీమతి సుందరమ్మ ఆవేదనకు
సమాధానం చెప్పాలి. జనసేన పార్టీ బాధితులకు అండగా నిలుస్తుంది. బాధిత
కుటుంబానికి పార్టీ తరఫున రూ. లక్ష ఆర్థిక సహాయం అందిస్తాం. బాధిత కుటుంబం
తరఫున చివరి వరకు పోరాడుతాం.
నాయకత్వ మార్పు శ్రీకాకుళం నుంచి మొదలు కావాలి : రాజకీయమంటే కొన్ని కుటుంబాలు
పరిపాలన అంటే కొంతమంది వ్యక్తులు చేతుల్లోనే ఉండకూడదు. శ్రీకాకుళం నుంచి
రాజకీయ వ్యవస్థలో మార్పు మొదలు కావాలి. దానికి జనసేన పార్టీ వేదిక అవుతుంది.
యువతరం అంతా జనసేన పార్టీకి అండగా నిలబడుతున్నారు. వారి ఆవేదనను పవన్ కళ్యాణ్
కచ్చితంగా అర్థం చేసుకుంటారు. శ్రీకాకుళంలో మత్స్యకారుల సమస్య, వలసల సమస్య
చాలా ఎక్కువగా ఉంది. వీటిని నివారించడానికి ఏం చేయాలి అన్న దాని మీద జనసేన
పార్టీ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వస్తుంది. ఇప్పటికీ పలాస నియోజకవర్గంలో
రోడ్లు వేయాలని వంతనాలు కట్టాలని కోరుతున్నారు అంటే మనం ఎంత వెనకబడ్డామో అర్థం
అవుతుంది. స్వలాభం కోసం స్వార్థం కోసం పదవులు ఉపయోగించి నాయకులు మారాలన్నారు.