పంజాబ్, హిమాచల్, కశ్మీర్‌లలో ఎడతెగని వానలు
డీల్లీలో 40ఏళ్ల రికార్డులు బద్దలు
పరిస్థితిపై హోం మంత్రి అమిత్‌షా సమీక్ష
న్యూఢిల్లీ : ఉత్తరాదిపై కుంభవృష్టి కురుస్తోంది. ఢిల్లీ , పంజాబ్, హరియాణా,
హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్ వంటి రాష్ట్రాల్లో ఎడతెగని వానలు
పడుతున్నాయి. యుమున సహా పలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలు, కొండచరియలు
విరిగిపడడం వంటి వేర్వేరు ఘటనల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు రైళ్లు
రద్దయ్యాయి. రోడ్లు తెగిపోయాయి. వాహనాల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర వరకు 36 గంటల వ్యవధిలో ఢిల్లీలో రికార్డుస్థాయిలో
260 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జులై నెల మొత్తం 195.8 ఎం.ఎం. వర్షం
కురియాల్సి ఉండగా ఒకటిన్నర రోజుల్లోనే అంతకంటే 30% ఎక్కువ పడింది. 1982 తర్వాత
ఇంత తక్కువ వ్యవధిలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనని అధికారులు తెలిపారు. 1958
తర్వాత జులై నెలలో ఇలా జరగడం ఇది మూడోసారి. ఉత్తరాదిలో వర్షాలపై కేంద్ర
హోంమంత్రి అమిత్‌షా సమీక్ష నిర్వహించారు.
ఢిల్లీ కి వరద ముప్పు : ఢిల్లీలో పలు ప్రాంతాల్లో రహదారులన్నీ జలమయమయ్యాయి.
వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో 2-3 రోజుల పాటు దిల్లీలో వర్షం
కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. యమునా నది పొంగి ప్రవహిస్తోంది. లక్ష
క్యూసెక్కుల నీటిని ఈ నదిలోకి హరియాణా విడుదల చేయడంతో మొదటి ప్రమాద హెచ్చరిక
జారీ అయింది. మంగళవారానికి ఆ నీరు ఢీల్లీకి చేరి, నదిలో నీటిమట్టం ప్రమాద
స్థాయి (205.33 మీటర్లు)ని దాటేస్తుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అంచనా
వేసింది. దీంతో వివిధ విభాగాల అధికారుల్ని అప్రమత్తం చేసి 16 కంట్రోల్ రూంలు
నెలకొల్పారు. దిల్లీ, నొయిడా, గురుగ్రామ్‌లలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు
ప్రకటించారు. గురుగ్రామ్‌లో వాహనదారులకు ప్రత్యక్ష నరకం కనిపించింది. ఇళ్లలోకి
నీరు చేరింది. కొన్ని అపార్ట్మెంట్ల సెల్లార్లు నీటితో
నిండిపోయాయి.హిమాచల్‌ప్రదేశ్‌లో జనజీవనం అస్తవ్యస్తమైంది. మృతుల్లో ఐదుగురు ఈ
రాష్ట్రం వారే. ఏడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. 14 చోట్ల
కొండచరియలు బీభత్సం సృష్టించాయి. బియాస్ నది ప్రమాదకర స్థాయిలో
ప్రవహిస్తోంది. 700 రహదారులు మూసివేశారు. మనాలీ-లేహ్ జాతీయ రహదారిపై రాకపోకలు
స్తంభించాయి. మనాలీలో వరద ప్రవాహంలో కార్లు కాగితపు పడవాల్లా కొట్టుకుపోయాయి.
మండీ జిల్లాలో ఓ ఉక్కువంతెన కొట్టుకుపోయింది. ఉత్తరాఖండ్‌లో గంగా నదిలో కారు
పడిపోయిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు.