మల్లిగ్యాంగ్ – 1 ఉపగ్రహంతో కొత్తగా అభివృద్ధి చేసిన చొల్లిమా-1 రాకెట్
నింగిలోకి దూసుకెళ్లింది. అయితే రెండు దశల అనంతరం ఇంజిన్లు థ్రస్ట్‌ను
కోల్పోవడంతో సముద్రంలో రాకెట్ కూలిపోయిందని ఉత్తరకొరియా అధికారిక మీడియా
సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ప్రయోగం
విఫలమైనప్పటికీ ఉ.కొరియా పెంపొందించుకుంటున్న సాంకేతికతపై సరిహద్దు దేశాలు
దక్షిణ కొరియా, జపాన్ ఆందోళన వ్యక్తం చేశాయి.
దక్షిణ కొరియాలో గందరగోళం : ఉత్తర కొరియా ప్రయోగం నేపథ్యంలో ద.కొరియా రాజధాని
సియోల్‌లో గందరగోళం ఏర్పడింది. బుధవారం ఉదయం 6.37 గంటలకు రాకెట్ నింగిలోకి
దూసుకెళ్లగా సుమారు 14 నిమిషాల అనంతరం సియోల్ ప్రజల సెల్ఫోన్లకు అధికారులు
అత్యవసర సందేశాలు పంపించారు. కారణాన్ని పేర్కొనకుండా ప్రజలందరూ సురక్షిత
ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు. కాసేపటికే భద్రత మంత్రిత్వ శాఖ ఆ
సందేశాలు ఓ పొరపాటని ప్రకటించింది. ఉత్తర కొరియా ప్రయోగించిన ఏదైనా క్షిపణుల
శకలాలు దక్షిణ కొరియా భూభాగంలో పడే ప్రమాదముందని భావిస్తేనే ఇలాంటి అలెర్ట్‌లు
పంపాలని సూచించినట్లు సైన్యం వెల్లడించింది. అదీ కూడా 5 నిమిషాల లోపే పంపాలని
తెలిపింది. జపాన్ సైతం ఇదే తరహా హెచ్చరిక సందేశాలను తమ ప్రజలకు పంపించింది.
మరోవైపు ఉ.కొరియా ప్రయోగాన్ని అమెరికా ఖండించింది. బాలిస్టిక్ క్షిపణి
సాంకేతికతను వినియోగించకుండా నిషేధం ఉన్నప్పటికీ కిమ్ ఇలాంటి ప్రయోగాలు
చేపడుతుండటం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించింది.