నేటి నుంచి పింఛన్ల పంపిణీ
ఒక్క రోజు ముందే సచివాలయాల ఖాతాలో జమ
విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా 63,14,192 మంది అవ్వాతాతలు, వితంతు,
దివ్యాంగులు, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గురువారం
నుంచి 1739.75 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం పింఛన్ల రూపంలో పంపిణీ చేయనుంది.
లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ఈ డబ్బులను బుధవారమే ఆయా గ్రామ/వార్డు సచివాలయాల
బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయగా స్థానిక సిబ్బంది నిధులను డ్రా చేసి,
వలంటీర్ల వారీగా పంపిణీ కూడా చేశారు. గురువారం తెల్లవారుజాము నుంచి తమ
పరిధిలోని లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్ సొమ్ము అందచేస్తున్నట్లు ఉప
ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. వలంటీర్ల ఆధ్వర్యంలో 5వ తేదీ వరకు
లబ్ధిదారుల ఇంటి వద్దనే ఈ పంపిణీ కొనసాగుతుందని, ఎలాంటి ఫిర్యాదులు లేకుండా
పంపిణీ ప్రక్రియ కొనసాగేందుకు 26 జిల్లాల్లో డీఆర్డీఏ కార్యాలయాల్లో
ప్రత్యేక కాల్ సెంటర్లనూ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.