పాదయాత్రకు పలువురి మద్దతు
అలరించిన ప్రజా నాట్యమండలి రూపకాలు
బిజెపి వైసిపి స్పందించకపోతే పోలవరం జైత్రయాత్రే
ఆదివాసీలు మూడో కన్ను తెరుస్తారు తస్మాత్ జాగ్రత్త
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
వి.శ్రీనివాసరావు
వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా కార్యదర్శి బి వెంకట్
విజయవాడ : పోలవరం నిర్వాసితుల హక్కుల కోసం సిపిఎం చేపట్టిన పోలవరం పోరు కేక
మహాపాదయాత్ర మూడోరోజు కొండరాజుపేటలో గురువారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ
కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా కార్యదర్శి బి వెంకట్ పొల్గొని
మద్దతు తెలిపారు. 3వ రోజు కొండరాజుపేట పల్లూరు మీదుగా పాదయాత్ర ముందుకు
సాగింది. ప్రతి ఇంటిని పలకరిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు.
ప్రజానాట్యమండలి కళాకారులు గోదారమ్మ నీటిమవ్వలం, రేల పాటల పూల కొమ్మలం,
మమ్మల్ని ముంచక చూస్తే పదును ఈటెలం అంటూ కళారూపాలు ప్రదర్శించారు. రేపాక
సెంటర్లో స్థానిక మహిళలు పూలమాలలతో స్వాగతం పలికారు. సిఐటియు సంఘ ఆధ్వర్యంలో
వ్యవసాయ కూలీలు, గిరిజనులు పార్టీ ముఖ్య నాయకులను ఎర్రజెండాలతో స్వాగతించారు.
ఆదివాసి యువత వారి సాంప్రదాయ బాణాలతో పాదయాత్రలో కలిసినడిచారు. గురువారం
మధ్యాహ్నానికి సుమారు 10 కిలోమీటర్లు మహాపాదయాత్ర కొనసాగింది. పోలవరం
ప్రాజెక్టు కోసం భూములు, ఇల్లు, తమ సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితుల
హక్కులను కాలరాస్తే ఆదివాసీలు మూడో కన్ను తెరవడం ఖాయమని కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలను వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా కార్యదర్శి బి వెంకట్
హెచ్చరించారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం పునరావాసం కల్పించాలని డిమాండ్
చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పోలవరం పోరు కేక మహా పాదయాత్ర గురువారం
కూనవరం మండలంలోని కొండరాజుపేట, ఆర్కూరు, రేపాక గ్రామాలలో పర్యటించింది. ఈ
సందర్భంగా ఆర్కూర్లో నిర్వహించిన సమావేశానికి వి.ఆర్.పురం ఎంపీటీసీ పూణెం
ప్రదీప్ అధ్యక్షత వహించారు. రేపాక గ్రామ సెంటర్లో నిర్వహించిన సమావేశానికి
కూనవరం వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బి.వెంకట్
మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులు చేపట్టిన ఈ మహా
పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. కూనవరం, విఆర్ పురం మండలాల్లో
ప్రజలు ప్రలోభాలకు సైతం నెరవకుండా ఎర్ర జెండా అభ్యర్థులను గెలిపించుకున్నారని
అభినందించారు. మాజీ ఎమ్మెల్యేలు కుంజా బుజ్జి, సున్నం రాజయ్య, మాజీ ఎంపీపీ
కారం శిరమయ్య అందించిన సేవలను గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం
ప్రతిపాదించినప్పుడే పోలవరం నిర్వాసితుల పక్షాన నిలబడి నిర్వహించిన పోరాటాన్ని
గుర్తు చేశారు. కానీ ఆచరణలో అమలుకు నోచుకోలేదన్నారు. విభజన చట్టంలో జాతీయ
ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపిస్తుందని
మండిపడ్డారు. 2019 ఎన్నికల ముందు ఈ ప్రాంతంలో పర్యటించిన వైయస్ జగన్మోహన్
రెడ్డి ప్రజలను ఆదుకుంటామని ఇచ్చిన హామీ పూర్తిగా విస్మరించారన్నారు.
ప్రాజెక్టునిర్మాణం పూర్తి చేసి కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు గత టిడిపి,
ప్రస్తుత వైసిపి పోటీ పడుతున్నాయని అన్నారు. ఎకరా భూమికి కేవలం 1,15,000 ఇచ్చి
చేతులు దులుపుకున్నారని అన్నారు. అధికారంలోకి వస్తే ఐదు లక్షలు ఇస్తామంటూ
చేసిన హామీని బుట్ట దాఖలు చేశారని అన్నారు. పోలవరం నిర్వాసితులకు అందజేసే
పరిహారం పునరావాసం దయదాక్షిణ్యం కాదని మండిపడ్డారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులు
చేపట్టిన ఈ మహా పాదయాత్ర జులై 4వ తేదీ వరకు కొనసాగుతుందని, అప్పటికి
ప్రభుత్వం స్పందించకపోతే పాలకుల సంగతి తేల్చేందుకు నిర్వాసితులు సిద్ధంగా
ఉన్నారని హెచ్చరించారు. పునరావాసం పరిహారం కల్పించాకే తమ ఊరిలోకి అడుగు
పెట్టాలని హెచ్చరిస్తూ ప్రతి ఊరి ముందు గ్రామ ప్రజలు బోర్డులు ఏర్పాటు చేయాలని
పిలుపునిచ్చారు. ఇందులో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఎప్పటికీ అతీగతీ లేకపోవడం
పనికిమాలిన దద్దమ్మ ప్రభుత్వాల పనితీరుకు నిదర్శనమని మండిపడ్డారు. గత టిడిపి
ప్రస్తుత వైసీపీ ప్రాజెక్టు నిర్మాణానికి తహతహలాడుతూ కాంట్రాక్టర్ల జేబులు
నింపేందుకు పోటీ పడుతున్నాయని అన్నారు. మునిగిపోతున్న ప్రజల గురించి ఎందుకు
పట్టడం లేదని ప్రశ్నించారు. నిర్వాసితుల కోసం జరిగే ఈ పోరాటంలో కలిసి రావాలని
పిలుపునిచ్చారు. దళితులను, ముస్లింలను, వెనుకబడిన తరగతులు, ఆదివాసీల హక్కులను
కాలరాస్తున్న బిజెపితో చెలిమి చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరిని
ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. నీతి నిజాయితీ ఉంటే బిజెపితో తెగదెంపులు చేసుకొని
ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. పట్టిసీమలో ఎకరా భూమికి 50 లక్షలు ఇచ్చారని,
ప్రాంతంలోనూ అదే రీతిగా రూ 50 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు
సైతం అదేవిధంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామాలు ఖాళీ చేసే
నాటికి 18 సంవత్సరాల నిండిన యువతియువకులందరికీ కట్ ఆఫ్ డేట్ తొలగించిఆర్
అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా
కార్యదర్శి బొప్పెన కిరణ్, మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, వీఆర్ పురం
ఎంపీటీసీ ప్రదీప్ కుమార్, విఆర్ పురం శ్రీరామ్ గిరి సర్పంచ్ పులి సంతోష్
కుమార్, వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య కూతురు సర్పంచ్ వెంకమ్మ, సర్పంచ్
నాగమణి, సర్పంచి జయసుధ, కోటూరు ఎంపిటిసి అమ్మాజీ, వి ఆర్ పురం ఎంపీపీ కారం
లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య సతీమణి సుక్కమ్మ, మాజీ ఎంపీపీ సున్నం
నాగమ్మ, నాయకులు కుంజా రాధా, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు,
మహిళా సంఘం నాయకులు మట్ల వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.