విజయవాడ : సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఒత్తిడి
పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేతలు సిద్ధమవుతున్నారు. అవసరమైతే మరోసారి
గవర్నర్‌ను కలిసేందుకు సిద్ధమని చెబుతున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సహా ఇతర చెల్లింపులపై చట్టం చేయాలని డిమాండ్
చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో సమావేశమైన నేతలు భవిష్యత్
ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.
ఉద్యోగుల బకాయిలు, చెల్లింపులు, చట్టబబద్ధత అనే అంశంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల
సంఘం నేతలు విజయవాడలో చర్చా వేదిక నిర్వహించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న
ఇబ్బందులు, ఆర్థిక ప్రయోజనాలు తదితర అంశాలపై చర్చించారు. 13 తీర్మానాలను
ఆమోదించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయడంలో
జరిగిన జాప్యం రీత్యా సుమారు 9 నెలలు కాలానికి పూర్తిస్థాయి వేతనం
చెల్లించాలని గ్రామ, వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది.
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రెవెన్యూ ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదని
ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యా సాగర్
అవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల అనుమతి లేకుండా జీ పీ ఎఫ్ ఖాతాల నుంచి
తీసుకున్న సొమ్ము తిరిగి ఉద్యోగుల ఖాతాల్లో వేసేందుకు నిర్దిష్ట కాలవ్యవధిని
ప్రభుత్వం ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రిటైరయిన వారికి
రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వడంలోనూ మీనమేషాలు లెక్కిస్తోందని ఆగ్రహం
వ్యక్తం చేశారు. న్యాయ, శానస వ్యవస్థలో జీతభత్యాలకు చట్టబద్ధత ఉందని అదే
తరహాలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు చట్టబద్ధత కల్పించాలని ఉద్యోగ సంఘం
నేతలు డిమాండ్ చేశారు. గవర్నర్ ను కలవడంపై కొన్ని సంఘాల నేతలు ఆర్థంలేని
ఆరోపణలు చేస్తున్నారని ఏపీజీఈఏ ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు అన్నారు.
వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల జీతాల చెల్లింపులపై చట్టం చేయాలనే
డిమాండ్‌తో అన్ని పార్టీలకు వినతి పత్రాలివ్వాలని చర్చా వేదికలో తీర్మానం
చేశారు. జీతాల చెల్లింపుల చట్టబద్ధతకు అవసరమైతే మరోసారి గవర్నర్‌ను కలవాలని
నిర్ణయించారు.