ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖ
ఉన్నతాధికారులతో సమీక్ష
హైదరాబాద్ : దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 14 న నిర్వహించే వైద్యారోగ్య
దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు
ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ
రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
దశాబ్ది వేడుకల్లో భాగంగా వైద్యారోగ్య శాఖ దినోత్సవం నాడు చేసే కార్యక్రమాల
గురించి చర్చించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి మార్గ
నిర్దేశంలో వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, ఆరోగ్య
రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానానికి ఎదిగిందని మంత్రి అన్నారు. జిల్లాకు
ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా వేగవంతమైన అడుగులు వేస్తున్నామని,
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆరోగ్య తెలంగాణ ఆశయం నెరవేరే దశకు చేరుకున్నామని
మంత్రి చెప్పారు. ప్రాథమిక స్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ సేవల వరకు తెలంగాణ
ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం ఎంతో శ్రమించిందని గుర్తు చేశారు. అడుగు
దూరంలో పల్లె దవాఖానాలు, బస్తీ ప్రజల సుస్తీ పోగొట్టే బస్తి దవాఖానాలు, తల్లి
బిడ్డల సంక్షేమాన్ని చూసేలా మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, 57 రకాల ఉచిత
పరీక్షలు అందించే తెలంగాణ డయాగ్నొస్టిక్స్, మూడు నుంచి 102 కు డయాలసిస్
సెంటర్ల పెంపు, ప్రతి పడకకు ఆక్సిజన్ సౌకర్యం, చేరువైన వైద్య, నర్సింగ్ విద్య,
ఇలా అనేక కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు. బిడ్డ కడుపులో పడగానే కేసీఆర్
న్యూట్రిషన్ కిట్, బిడ్డ పుట్టగానే కేసీఆర్ కిట్, తల్లి బిడ్డను ఇంటికి
చేర్చేందుకు అమ్మఒడి వాహనాలు, మహిళల ఆరోగ్యం కోసం ఆరోగ్య మహిళ, కంటి వెలుగు,
సి పి ఆర్ ట్రైనింగ్ ఇలా ఇతర ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని పథకాలు తెలంగాణ
ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు
దవఖానకు అని పాటలు పాడితే ఇప్పుడు నేను సర్కారు దవాఖానకే పోతా అనే రోజులు
వచ్చాయని తెలిపారు.
ఈ మార్పు వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంపూర్ణ మద్దతుతో పాటు వైద్య
ఆరోగ్యశాఖ నిరంతర శ్రమ, ప్రజల సహకారం దాగి ఉందన్నారు. సీఎం కేసీఆర్ గారు
నిర్దేశించిన మేరకు వైద్య ఆరోగ్యశాఖ సాధించిన విజయాలు, అందిస్తున్న వైద్య
సేవలను ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజా
ప్రతినిధుల సహకారంతో, ఇతర శాఖల సమన్వయంతో, ప్రతి నియోజకవర్గాల్లో సమావేశాలు
నిర్వహించాలని మంత్రి చెప్పారు. వైద్యారోగ్య రంగంలో సాధించిన సంపూర్ణ ప్రగతిని
జిల్లాల వారీగా తెలియజేస్తూ, కరపత్రాన్ని రూపొందించి ఆరోజు ఆవిష్కరించి,
పంపిణీ చేయాలి. ఉత్తమ ఆశా వర్కర్, ఉత్తమ ఏఎన్ఎం, ఉత్తమ స్టాఫ్ నర్స్, ఉత్తమ
ల్యాబ్ టెక్నీషియన్, ఉత్తమ డాక్టర్ ఇలా ఆరోగ్య శాఖలోని పలు విభాగాల్లో ఉత్తమ
సేవలు అందించిన ఉద్యోగులు, వైద్య సిబ్బందికి ప్రశంస పత్రాలు మెమెంటోలు
అందించాలన్నారు. వైద్యారోగ్య దినోత్సవం స్ఫూర్తిని చాటేలా వైద్య ఆరోగ్య
సిబ్బంది బ్యాడ్జీలు ధరించాలని చెప్పారు. పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు
సహా అన్ని ఆసుపత్రులను అలంకరించాలన్నారు.
ఉన్నతాధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు : దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వైద్యారోగ్య
దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకుగాను అన్ని విభాగాల వైద్యాధికారులు ఉమ్మడి
జిల్లాల వారీగా ఉంటూ ఏర్పాట్లు పర్యవేక్షించాలన్నారు. ఈమేరకు ఆయా జిల్లాల్లో
ఏర్పాట్ల బాధ్యతలను అధికారులకు అప్పగించారు. హెల్ సెక్రటరీ నల్గొండ, కమిషనర్
శ్వేతా మహంతి మెదక్, ఆయుష్ కమిషనర్ ప్రశాంతి మహబూబ్నగర్, డిఎంఇ రమేష్ రెడ్డి
వరంగల్, డిహెచ్ శ్రీనివాస్ అదిలాబాద్, టీవీవిపి కమిషనర్ నిజామాబాద్, ఓఎస్డి
గంగాధర్ కరీంనగర్, ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాచ్చి రంగారెడ్డి, చంద్రశేఖర్
రెడ్డి హైదరాబాద్, ఇడి కౌటిల్య ఖమ్మం జిల్లాలకు ముందుగా వెళ్లి ఏర్పాట్లు
పర్యవేక్షించి కార్యక్రమం విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని జూన్ 14న నిర్వహించే వైద్యరోగ్య దినోత్సవం
లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిమ్స్ విస్తరణ పనులకు శ్రీకారం
చుట్టనున్నారు. ఇందులో భాగంగా రూ.1571 కోట్లతో నిర్మించబోయే 2000 పడకల
ఆసుపత్రి భవనానికి జూన్ 14 న సీఎం గారు శంకుస్థాపన చేస్తారు. దీనికి
సంబంధించిన ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు మంగళవారం వైద్యారోగ్య అధికారులు,
పోలీసు అధికారులు, జిల్లా కలెక్టర్, నిమ్స్ డైరెక్టర్, ఆర్ అండ్ బి అధికారులతో
కలిసి పర్యవేక్షించారు. కొత్త భవనం నిర్మించే స్థలాన్ని సందర్శించి భూమి పూజ
కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం 5000
మందితో నిర్వహించే సభకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. వచ్చిన వారికి
భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్య రాకుండా చూడాలని
పోలీసు అధికారులను ఆదేశించారు. భూమిపూజ, సభకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి
చేయాలని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.