గేమ్‌ఛేంజర్‌గా అభివర్ణించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
గుంటూరు : విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పునకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు శ్రీకారం చుట్టారు. ఇక నుంచి ఉన్నతవిద్యలో
ప్రపంచస్థాయి కోర్సులు.. అదీ అత్యుత్తమ యూనివర్సిటీల సర్టిఫికెట్ కోర్సులు
ఉచితంగా అందించబోతోంది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం ప్రఖ్యాత సంస్థ ఎడెక్స్‌తో
ఎంవోయూ కుదు ర్చుకుంది. ప్రఖ్యాత మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కంపెనీ ఎడెక్స్‌తో
ఏపీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం తాడేపల్లిలోని క్యాంప్
కార్యాలయంలో ఎడెక్స్ సీఈవో, ‘పద్మశ్రీ’ అనంత్ అగర్వాల్ ఈ ఒప్పందంపై స్వయంగా
సంతకం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్,
క్రేంబ్రిడ్జి సహా పలు ప్రపంచ అత్యుత్తమ వర్శిటీల నుంచి సంయుక్త
సర్టిఫికెట్లను విద్యార్థులకు అందిస్తారు. ఈ ఒప్పందం ఉన్నత విద్యలో గేమ్
ఛేంజర్‌గా నిలుస్తుందని సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. నిరుపేద
విద్యార్థులకు ఈ ఒప్పందం కారణంగా మరింత మేలు జరుగుతుంది. ఉన్నత విద్య
అభ్యసిస్తున్న విద్యార్థికి ప్రపంచప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను నేర్చుకునే
అవకాశం ఉంటుంది. కోర్సులు చేసిన విద్యార్థులకు హార్వర్డ్, ఎంఐటీ,
క్రేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్శిటీలతో ఎడెక్స్ సంయుక్త
సర్టిఫికేషన్ విద్యార్థులకు లభిస్తుంది.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రఖ్యాత మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు
కంపెనీ ఎడెక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందంపై ఎడెక్స్
వ్యవస్థాపకుడు, సీఈఓ, పద్మశ్రీ అవార్డు గ్రహీత అనంత్ అగర్వాల్, ఉన్నత
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె శ్యామలరావు సంతకాలు చేశారు. ఈ
కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా
మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్,
ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె శ్యామలరావు, ఎడెక్స్ ప్రతినిధులు, ఇతర
ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
శాస్త్ర, సాంకేతిక, సామాజిక , సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన వివిధ రకాల
సబ్జెక్టులు, ఈ ఒప్పందం ద్వారా అందుబాటులోకి వస్తాయి. మన దేశంలో లభ్యంకాని
ఎన్నోకోర్సులను కూడా నేర్చుకునే అవకాశం వస్తుంది. ఇంజినీరింగ్, మెడిసిన్
లాంటి కోర్సులే కాదు, ఆర్ట్స్, కామర్స్‌లో పలురకాల సబ్జెక్టులకు చెందిన
కోర్సులుఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. అంతిమంగా మంచి
ఉపాధి, ఉద్యోగావకాశాలు రాష్ట్ర విద్యార్థులకు దక్కాలి అని సీఎం జగన్
ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ అధికారం చేపట్టాక పేద విద్యార్థులకు
సంక్షేమ పథకాల ద్వారా అండగా, ఆసరాగా నిలవడంతో పాటు విద్యారంగానికి సంబంధించిన
ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ఏపీ
విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆయన ధృడ సంకల్పం ఈ ఒప్పందంతో మరో అడుగు
ముందుకు వేసినట్లయ్యింది.