చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు
మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు , నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 50వేల ఎకరాల్లో
కూరగాయలు, పండ్ల తోటల పెంపకం చేపడుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్
గ్రామీణాభివృద్ధిశాఖ, వ్యవసాయశాఖ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు,
సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఉపాధిహామీ పథకంలో నమోదైన చిన్న,
సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీలను సబ్సిడీల ద్వారా ప్రోత్సహిస్తామన్నారు. ఈ
నెలాఖరులోగా లబ్ధిదారులను గుర్తిస్తామని, వచ్చే ఆగస్టు 31 నాటికి మొక్కల
పెంపకాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్ఆర్డీ)లో కూరగాయలు,
పండ్ల తోటల పెంపకంపై వర్క్‌షాపు నిర్వహించారు. దీనికి మంత్రులు ముఖ్యఅతిథులుగా
హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ‘‘రాష్ట్రంలో కూరగాయల కొరతకు తోడు
పండ్ల తోటల అవసరం ఉంది. దీనిని గుర్తించి ఉపాధి హామీ, ప్రధానమంత్రి కృషి
సించాయి యోజనల కింద కూరగాయలు, పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించాం.
సీతాఫలం, యాపిల్, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, జీడిమామిడి, కొబ్బరితో పాటు
మునగ, ఆయిల్‌పామ్ వంటి అధిక దిగుబడినిచ్చే తోటల పెంపకం జరగాలి. ఈ పథకంలో
ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% సబ్సిడీ, చిన్న సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ
ఇస్తాం. ఒక్కో రైతు గరిష్ఠంగా అయిదెకరాల్లో వీటిని సాగు చేయవచ్చు. లబ్ధిదారుల
ఎంపికను వెంటనే చేపడతాం. వారు మొక్కలను ప్రభుత్వ నర్సరీలు, రిజిస్టర్డ్
ప్రైవేట్ నర్సరీల ద్వారా గాని కొనుగోలు చేయవచ్చు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల
గుర్తింపు పూర్తిచేసి, వచ్చేనెల 31 నాటికి మొక్కలునాటాలి. భూముల ఎంపిక, గుంతలు
తీయడం, నాటడం మొదలుకొని పండ్ల ఉత్పత్తి దశ వరకు అన్ని అంశాల్లో ఉద్యానవన శాఖ
మార్గదర్శకాలను పాటించాలి. రైతు వేదికలలో ఆయా గ్రామాల్లోని రైతులతో సమావేశాలు
నిర్వహించి అవగాహన కల్పించాలని మంత్రులు సూచించారు. ఈ కార్యక్రమంలో రెండు శాఖల
ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు సందీప్ కుమార్ సుల్తానియా, రఘునందన్ రావు,
హనుమంతరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.