లండన్ : బ్రిటన్‌లో రిషి సునాక్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నాయకత్వంలోని
అధికార కన్జర్వేటివ్ పార్టీ.. మూడు పార్లమెంటు స్థానాలకు జరిగిన ఉప
ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమి పాలైంది. ఉత్తర ఇంగ్లాండ్‌లోని సెల్బీ-అయిన్‌స్టీ
నియోజకవర్గంలో లేబర్ పార్టీ గెలుపొందింది. గతంలో ఇక్కడ కన్జర్వేటివ్ పార్టీ
20 వేలకు పైగా మెజార్టీని సాధించిన సంగతి గమనార్హం. మరోవైపు
సోమర్సెట్-ఫ్రోమ్ స్థానాన్ని లిబరల్ డెమోక్రాట్స్ పార్టీ కైవసం చేసుకుంది.
ఇక కన్జర్వేటివ్ పార్టీ ఉక్స్బ్రిడ్జ్-సౌత్ రూయిస్లిప్ సీటును మాత్రం
దక్కించుకొంది. అక్కడ కేవలం 495 ఓట్లతో గెలుపొందింది. గతంలో ఇది బ్రిటన్ మాజీ
ప్రధాని బోరిస్ జాన్సన్ గెలిచిన స్థానం. సునాక్ ప్రభుత్వ ఆర్థిక
ప్రణాళికలపై ఓటర్లు ఇచ్చే తీర్పుగా ఈ ఉప ఎన్నికలను విశ్లేషకులు భావించడం,
దీంతోపాటు సునాక్ నాయకత్వంలోనే కన్జర్వేటివ్ పార్టీ వచ్చే ఏడాది జరగనున్న
సాధారణ ఎన్నికల్లో బరిలోకి దిగనుండటంతో ఈ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రతికూల ఫలితాలు రావడం సునాక్ నాయకత్వంపై ఒత్తిడిని
గణనీయంగా పెంచుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.