అందరికీ ఒకే విధానమన్న విధానానికి తాము వ్యతిరేకం
యూసీసీ అమలు వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలతో లా కమిషన్ కు లేఖ
భారత్ అంటేనే భిన్న సంప్రదాయాలు కలిగిన సమాజం
ఉమ్మడి పౌర స్మృతికి (యూసీసీ) తాము వ్యతిరేకమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్
స్పష్టం చేశారు. అందరికీ ఒకే విధానమన్న విధానానికి తాము వ్యతిరేకమని తెలిపారు.
యూసీసీని తాము వ్యతిరేకిస్తున్నట్లు స్టాలిన్ లా కమిషన్ కు లేఖ రాశారు. యూసీసీ
అమలు వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలపై ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
సమాజంలోని భిన్న వ్యవస్థలను ఇది సవాల్ చేయడంతో పాటు తీవ్రముప్పుగా మారుతుందని
ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ అంటేనే భిన్న సంప్రదాయాలు కలిగిన సమాజమని,
ఇలాంటి చోట యూసీసీ ఆలోచనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఆర్టికల్ 29ని
అనుసరించి మైనార్టీ హక్కుల్ని గౌరవిస్తున్న భారత్ లౌకిక దేశంగా
గర్విస్తోందన్నారు. జిల్లా, ప్రాంతీయ మండళ్ల ద్వారా గిరిజన ప్రాంతాల ప్రజలు
వారి సంప్రదాయాలు, పద్ధతులను కాపాడుకునే వెసులుబాటును రాజ్యాంగం
కల్పిస్తోందన్నారు. గిరిజన సంప్రదాయాలను ఇది ప్రభావితం చేస్తుందని ఆందోళన
వ్యక్తం చేశారు. సామాజిక, ఆర్థిక అసమానతలను పరిగణలోకి తీసుకోకుండా యూసీసీని
అమలు చేస్తే దుష్పరిణామాలు ఉంటాయన్నారు. భారత్ సమాజంలోని భిన్న వర్గాల్లో
అభివృద్ధి, విద్య, అవగాహన వేర్వేరుగా వున్నాయని పేర్కొన్నారు. అందరికీ ఒకే
విధానం అనే భావనతో యూసీసీని అమలు చేస్తే అసమానతలు మరింత పెరుగుతాయన్నారు.