అనుమతి షరతులు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు
ఇటీవలి రెండు దుర్ఘటనల నేపథ్యంలో హోం శాఖ ఉత్తర్వులు
అమరావతి : రాష్ట్రంలో రోడ్ షో సభలు, ర్యాలీలను నియంత్రించాలని ఏపీ ప్రభుత్వం
నిర్ణయించింది. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరుల్లో ఇటీవల జరిగిన
తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీచేసింది.
మున్సిపల్, పంచాయతీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద పోలీసు యాక్ట్
నిబంధనలను అమలు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డు షోలు నిర్వహించకుండా
చూడాలని ఆదేశాల్లో హోంశాఖ పేర్కొంది. రోడ్డుకు దూరంగా ప్రజలకు ఇబ్బందిలేని
విధంగా సభలు, రోడ్డు షోలు నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక
చేయాలని అధికారులకు హోంశాఖ సూచించింది. ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలు,
ర్యాలీలు జరిగేలా చూడాలని స్పష్టం చేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో షరతులతో
కూడిన అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొంది.
రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.
ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపైన, మార్జిన్లలో సభలు,
ర్యాలీలకు అనుమతించేది లేదని స్పష్టంచేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో
జిల్లా ఎస్పీలు లేదా పోలీస్ కమిషనర్లు కచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వొచ్చని
మినహాయింపునిచ్చింది. ఈమేరకు హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1861
పోలీస్ చట్టం ప్రకారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా
సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలతో ప్రజలకు
అసౌకర్యం కలిగిస్తుండటంతోపాటు, వాటి నిర్వహణలో లోటుపాట్లు, నిర్వాహకుల
నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలిగొంటున్న నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్‌ను అమలు
చేస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర, మున్సిపల్,
పంచాయతీరాజ్ రహదారులు పూర్తిగా ప్రజల రాకపోకలు, సరుకు రవాణా కోసమే
ఉపయోగించాలని స్పష్టం చేసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సభల నిర్వహణకు
ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని ప్రభుత్వం జిల్లాల ఉన్నతాధికారులకు
సూచించింది. రహదారులకు దూరంగా, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సరైన
ప్రదేశాలను ఎంపిక చేయాలని పేర్కొంది. వివిధ పార్టీలు, ఇతర సంస్థలు సభలను ఎంపిక
చేసిన ప్రదేశాల్లో నిర్వహించుకోవచ్చని చెప్పింది.