మెరిట్ జాబితా అనంతరం వెబ్ఆప్షన్లకు అవకాశం
హైదరాబాద్ : తెలంగాణలోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2023
విద్యాసంవత్సరానికి కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య
విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్-యుజీ 2023లో అర్హత
సాధించిన అభ్యర్థులు శుక్రవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల
14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఆన్లైన్లో సమర్పించిన
ధ్రువపత్రాలను పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితా విడుదల చేస్తారు.
అనంతరం వెబ్ఆప్షన్లకు మరో నోటిఫికేషన్ వెలువడుతుంది. ప్రవేశాలకు సంబంధించి
పూర్తి వివరాలకు కాళోజీ విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.knruhs.telangana.gov.in
లో చూడాలని సూచించారు.
సింగరేణి ఉద్యోగుల పిల్లలకు 5శాతం సీట్లు : మంచిర్యాల జిల్లా రామగుండలోని
రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాల(సిమ్స్)లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లలో
5శాతం(7 సీట్లను) సింగరేణి ఉద్యోగుల పిల్లలకు రిజర్వ్ చేస్తూ రాష్ట్ర
వైద్యఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల విజ్ఞప్తులను పరిగణనలోకి
తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు శుభవార్త ప్రకటించారని మంత్రి
హరీశ్‌రావు ట్విటర్లో పేర్కొన్నారు. ఇందులో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు
ఉండగా, 23 సీట్లు(15శాతం) ఆల్ ఇండియా కోటాకు వెళ్తాయి. మిగిలిన 127లో 5శాతం
సీట్లు ఉద్యోగుల పిల్లలకు రిజర్వ్ అవుతాయని వివరించారు. దీంతోపాటు సిమ్స్‌లో
50 పడకలను సింగరేణి ఉద్యోగులకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
జారీ చేసింది.
సిమ్స్గా పేరు మార్పు: రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాల పేరును సింగరేణి
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్గా) మారుస్తూ రాష్ట్ర వైద్య
ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.