సిఎం జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడతా
మిల్లర్ల తో మంత్రి కారుమూరి నాగేశ్వర రావు
వెలగపూడి : విదేశాలకు బియ్యం ఎగుమతికి అవకాశం కల్పించాలని రైస్ మిల్లర్లు
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. థాయ్ లాండ్, మలేషియా, చైనా తదితర దేశాలలో
ఐఆర్ 64, రాజ్ ధాన్యం రకాలకు బాగా డిమాండ్ ఉందని ప్రభుత్వం కొన్ని సడలింపులు
ఇస్తే తమకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును
మిల్లర్లు కోరారు. అన్ని జిల్లాల రైస్ మిల్లర్ల ప్రతినిధులు, సివిల్ సప్లయ్స్
శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్ తో కలసి మంత్రి
కారుమూరి సోమవారం నాడిక్కడ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి
మాట్లాడుతూ రైస్ మిల్లర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విదేశాలకు బియ్యం
ఎగుమతులు నిలిపివేయడం వల్ల తమకు కలుగుతున్న ఇబ్బందులను మిల్లర్లు మంత్రి
దృష్టికి తెచ్చారు. కేరళ రాష్ట్రానికి పంపించే బియ్యానికి కూడా అక్కడ పలు
సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. గంటన్నరపాటు ఉడికితేనే నాణ్యమైన బియ్యం గా వారు
గుర్తిస్తాయి. తక్కువ సమయం తీసుకుంటే అంగీకరించారని తెలిపారు. కాబట్టి కేరళకు
పంపించే బియ్యానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని కోరారు. దీనిపై మంత్రి
స్పందిస్తూ రైతుల నుంచి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు తప్పని సరిగా కొనుగోలు
చేయాలని.. తక్కువ ధర చెల్లిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
రైతులకు నష్టం కలిగించే ఏ ఒక్క చర్యను ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఉపేక్షించరని స్పష్టం చేశారు. ఎగుమతులకు అనుమతి పై ముఖ్యమంత్రి తో
చర్చిస్తానని మిల్లర్లకు హామీ ఇచ్చారు. మిల్లింగ్ ఛార్జీలు డబ్బులు
ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రూ.120కోట్లు
ఇచ్చామన్నారు. డిసెంబర్, జనవరిలో మరో రెండు విడతల్లో నగదు జమ చేస్తామని మంత్రి
వివరించారు. పౌరసరఫరాల సంస్థ హెడ్డాఫీసు నుంచే నేరుగా మిల్లింగ్ ఛార్జీలు
చెల్లిస్తామని చెప్పారు. ఏదైనా సమస్యలు ఉంటే తనతో మాట్లాడవచ్చని మిల్లర్లకు
భరోసా ఇచ్చారు.