విజయవాడ : పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి
కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపి కేశినేని నాని, మాజీ
ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని నాని రక్తదాన
శిబిరాన్నిప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటేనే ఒక
సంచలనమని, ఆయన వ్యక్తిత్వం, పని తీరు అందరికీ ఆదర్శమన్నారు. నిజంగా
ఎన్టీఆర్లో ఒక దేవుడు.. రాముడు, అల్లా, జీసెస్ కనిపిస్తారన్నారు. అనేక
సామాజిక అంశాలపై సిని మాలు చేశారని, పేదల కోసం పార్టీ పెట్టి ఎన్నో సంక్షేమ
కార్యక్రమాలు అమలు చేశారన్నారని కొనియాడారు. పేదలను గతంలో ఓట్ల కోసం
వాడుకున్నాయని, ఎన్టీఆర్ మాత్రమే పేదలకు కూడు, గూడు, బట్ట ఇచ్చారన్నారు.
1983లో పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ గెలిచిందని, ఆ తరువాత ఇక్కడ పార్టీ
గెలవలేదని, కార్యాలయం కూడా ఇక్కడ పెట్టలేదని కేశినేని నాని అన్నారు. ఇటీవల
రాజు జైన్ ముందుకు వచ్చి సొంత డబ్బుతో పార్టీ కార్యాలయం పెట్టారని చెప్పారు.
టీడీపీ అన్ని వర్గాలకు అండగా ఉంటుందని, కలకాలం పార్టీ ఉండాలని, పార్టీలో
ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో తనకు
ఎటువంటి స్వార్ధం లేదన్నారు. పార్టీ ని అమ్మేసే వారు ఇక్కడ ఉండకూడదని, పార్టీ
కోసం పనిచేసే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.
జలీల్ ఖాన్ పార్టీ కోసం కమిట్ మెంట్తో పని చేశారని, చంద్రబాబు మీద ఉన్న
అభిమానంతో డిప్యూటీ సీఎం పదవిని త్యాగం చేశారన్నారు. 22 ఏళ్లుగా పార్టీని
అమ్మేసే వాళ్లను మాత్రం నమ్మొద్దన్నారు. టీమ్ టీడీపీ పశ్చిమ నియోజకవర్గం నేతల
కృషి అభినందనీయమని కేశినేని నాని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్
మాట్లాడుతూ కేశినేని నాని కృషి వల్ల టీడీపీ ఇక్కడ బాగా బలోపేతం అయ్యిందన్నారు.
అన్న ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం అందరూ కలిసి పని చేయాలని పిలుపిచ్చారు.
చంద్రబాబు సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని, పార్టీ విజయం కోసం
అందరూ కష్టపడాలని సూచించారు. మీడియా కూడా సంచలనాల కోసం కాకుండా పనిచేసే వారిని
చూపించాలని జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు.