ఆగస్టు నాటికి సీఓడీ దిశగా సన్నాహాలు
8789 మెగావాట్లకు పెరగనున్న ఏపీ జెన్కో ఉత్పత్తి సామర్థ్యం
విజయవాడ : ఇబ్రహీంపట్నం లోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్
(డాక్టర్ ఎన్టీటీపీఎస్)లో శుక్రవారం మరో యూనిట్‌ను ‘లైట్‌అప్’ చేసి
ట్రయల్ రన్ నిర్వహించారు. డైరెక్టర్లు, ఉన్నతాధికారులు, సిబ్బంది
హర్షధ్వానాల మధ్య ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏజీ జెన్కో ఛైర్మన్
విజయానంద్, మనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు కంప్యూటర్ బటన్
నొక్కి‘లైటఅప్’ చేశారు. డాక్టర్ ఎన్టీటీపీఎస్లో స్టేజ్ –5 కింద 800
మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన ఎనిమిదో యూనిట్ కోవిడ్ లాంటి
కష్టకాలాన్ని, అనేక సవాళ్లను అధిగమించి ఈ స్థాయికి రావడంపట్ల ఏపీ జెన్కో
అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ‘లైట్ అప్’ చేసిన అనంతరం
డైరెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు, ఉన్నతాధికారులతో కలిసి ఛైర్మన్ విజయానంద్,
ఎండీ చక్రధర్ బాబు ప్లాంటులోని అనేక విభాగాలను పరిశీలించారు. ‘ఆగస్టు నాటికి
సీఓడీకి వీలుగా మిగిలిన పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన
చర్యలు తీసుకోండి. ఇందుకు ఏపీ జెన్కో పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు
ఎల్లవేళలా సిద్ధంగా ఉంది’ అని బీహెచ్ఈఎల్, బీజీఆర్ ప్రతినిధులకు ఏపీ జెన్కో
ఛైర్మన్ విజయానంద్, ఎండీ చక్రధర్ బాబు స్పష్టం చేశారు. వారి సూచన ప్రకారమే
వీలైనంత త్వరగా మిగిలిన పనులు పూర్తి చేస్తామని, ఇందుకు తమ యాజమాన్యాలు
సిద్ధంగా ఉన్నాయని ఆయా సంస్థల ప్రతినిధులు హామీ ఇచ్చారు. ‘ప్రస్తుతం రాష్ట్ర
ప్రజల అవసరాల కోసం ఏపీ జెన్కో ప్రతిరోజూ సగటున 105 మిలియన్ యూనిట్ల
విద్యుత్‌ను గ్రిడ్‌కు అందిస్తోంది. ప్రస్తుత వేసవిలో ఎన్నడూలేని విధంగా
అనూహ్యంగా డిమాండు పెరిగినప్పటికీ రాష్ట్ర మొత్తం వినియోగంలో 40 నుంచి 45 శాతం
విద్యుత్‌ను ఏపీ జెన్కో అందిస్తోంది. కొత్తగా లైట్‌అప్ చేసిన యూనిట్ ఆగస్టు
నుంచి అందుబాటులోకి రాగానే రోజూ సగటున మరో 15 నుంచి 20 మిలియన్ యూనిట్లను
జెన్కో అదనంగా సరఫరా చేయనుంది’ అని ఛైర్మన్ విజయానంద్, ఎండీ చక్రధర్ బాబు
అధికారులతో నిర్వహించిన సమీక్షలో తెలిపారు. ఏపీ జెన్కో ఏపీ జెన్కో
డైరెక్టర్లు చంద్రశేఖర్ రాజు (థర్మల్), బి. వెంకటేశులు రెడ్డి (ఫైనాన్స్),
సయ్యద్ రఫీ (హెచ్ఆర్ అండ్ ఐఆర్), సత్యనారాయణ (హైడల్), అంథోనీ రాజ్
(కోల్), ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవి గొప్ప మైలురాళ్లు : ఛైర్మన్ విజయానంద్
ఏడాది కాలంలో 1600 మెగావాట్ల అదనపు సామర్థ్యంగల రెండు యూనిట్లు అందుబాటులోకి
రావడమనేది ఏపీ జెన్కో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయాలు. శ్రీ
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్
కేంద్రంలో 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగల స్టేజ్ –2 యూనిట్ ను
27–10–2022న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశారు.
ఆగస్టు నాటికి సీఓడీ : జెన్కో ఎండీ చక్రధర్ బాబు
ట్రయల్ రన్లో బయటపడే లోటుపాట్లను సరిదిద్దుకుని, మిగిలిన పనులు త్వరతగతిన
పూర్తి చేసి ఆగస్టు నాటికి స్టేజ్–5 ప్లాంటు వాణిజ్య ఉత్పత్తి (సీఓడీ)
చేసేందుకు వీలుగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళతాం. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్
మోహన్ రెడ్డి , ఇంధన, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ యూనిట్ –8ను త్వరగా
అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్
మార్గదర్శకం, ప్రభుత్వ సహకారంవల్లే స్టేజ్–5 లైట్ అప్ సాధ్యమైంది.
ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నందున వీలైనంత త్వరగా అన్ని పనులు
పూర్తి చేసుకుని వాణిజ్య ఉత్పత్తికి శ్రీకారం చుట్టేలా ముందుకెళదామని చక్రధర్
బాబు తెలిపారు.
8789 మెగావాట్లకు పెరగనున్న జెన్కో సామర్థ్యం
డాక్టర్ ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల ఎనిమిదో యూనిట్ వాణిజ్య ఉత్పత్తికి
శ్రీకారం చుడితే ఏజీ జెన్కో విద్యుదుత్పాదన సామర్థ్యం 8789 మెగావాట్లకు
పెరుగుతుంది. ప్రస్తుతం జెన్కో 5810 మెగావాట్ల థర్మల్, 1773.600 మెగావాట్ల
హైడల్, 405.426 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యం కలిగి ఉంది.
ఎన్టీటీపీఎస్లో మరో రెండు నెలల్లో 800 మెగావాట్ల థర్మల్ యూనిట్ వాణిజ్య
ఉత్పత్తి ప్రారంభిస్తే జెన్కో థర్మల్ ఉత్పాదన సామర్థ్యం 8789 మెగావాట్లకు
పెరుగుతుంది.
రాష్ట్ర అవసరాలకు ఎంతో ఉపయోగం
ఏపీ జెన్కో విద్యుదుత్పాదన పెరగడం రాష్ట్రానికి అన్ని విధాలా ప్రయోజనం.
జెన్కో ఉత్పత్తి సామర్థ్యం ఎంత పెరిగితే అంత మోతాదులో రాష్ట్ర అవసరాల కోసం
అధిక ధరలకు డిస్కమ్‌లు విద్యుత్ కొనాల్సిన అగత్యం తప్పుతుంది. రాష్ట్ర
విద్యుత్ అవసరాలు వీలైనంత అధికంగా తీర్చాలనే లక్ష్యంతో ఏపీ జెన్కో
ముందుకెళుతోంది. ఇందులో భాగంగానే లోయర్ సీలేరులో 230 మెగావాట్ల అదనపు
ఉత్పత్తి కోసం రెండు అదనపు యూనిట్లను 2024 ఏప్రిల్ నాటికి అందుబాటులోకి
తెచ్చే దిశగా శరవేగంగా పనులు చేస్తోంది.