గెలుపే లక్ష్యంగా పని చేద్దాం
ఎన్నికలకు సమాయత్తం కావాలి
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నాయకులతో రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి
గుంటూరు : రానున్న ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, పరిశీలకులతో గుంటూరు పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల నియోజకవర్గాల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా నన్ను నియమించిన ముఖ్యమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
జగన్ నాలుగున్నరేళ్లకు పైగా సాగించిన పాలనలో ప్రజల సంక్షేమమే పరమావదిగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. దీన్ని మనం ఎన్నికల్లో అనుకూ అస్త్రంగా ఉపయోగించుకోవాలని అన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ అభ్యుర్ధుల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాజిక న్యాయం పాటించారని అన్నారు. నియోజకవర్గాలలో ఇంచార్జీలను మార్పు చేసి, కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నారని అన్నారు. పార్టీ పెట్టినప్పటి నుండి,2014లో ఓటమి తరువాత ప్రతి పక్షపార్టీల నుండి అనేక దాడులను ఎదుర్కొన్నామని అన్నారు. ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజక వర్గాలలో గెలుపు కోసం ప్రణాళికతో ముందుకెళ్ధామని పిలుపునిచ్చారు. గెలుపు కోసం పార్టీ కార్యకర్తలను కలుపుకొని వారిలో అభద్రతా భావం లేకుండా భరోసా కల్పించాల్సిన బాధ్యత పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల మీద ఉందన్నారు. ఉద్యోగులు, ఎన్జీవోలు, ఏ వర్గాన్ని వదలకుండా అందర్ని కలుపుకు పోవాలన్నారు..పార్టీ కమీటిలను త్వరగా పూర్తి చేయాలన్నారు..గత ఎన్నికల్లో గెలుపుకు పార్టీ బూత్ కమిటిలు కీలకంగా వ్యవహరించాయన్నారు.
ఇప్పటికీ బూత్ కమీటీలు పూర్తి కాని నియోజకవర్గాలు త్వరగా పూర్తి చేసుకొవాలన్నారు. రానున్న 50 రోజులు ఎన్నికలకు కీలకం కావును అప్రమత్తంగా ఉండాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం లాంటి కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లోనే ఉండాలని చెప్పారు.
టిడిపి అనుకుల మీడియా కుట్రలను తిప్పికొట్టాలి
రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదు. అమరావతి రాజధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అంటూ టిడిపి, దానికి అనుకులంగా వ్యవహరించే మీడియా చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని, ఈ విషయాల్ని ప్రతి సమావేశంలో ప్రస్తావిస్తూ ప్రజలకు తెలియ జేయాలన్నారు. మనం రాజధానిని తరలించడం లేదు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నాదే జగన్ అభిమతం అన్న విషయాన్ని అందరికీ తెలియ జేయాలన్నారు.అందరం కలిసి పని చేసి మరోసారి జగన్ ని ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలి మనకి ప్రతి వర్గం, ప్రతి ఓటు కిలకమే దానికి తగిన విధంగా పార్టీ నాయకులు వ్యవహారించాలని ఆయన అన్నారు.
మంగళగిరిలో వైఎస్సార్సీపీ హ్యాట్రిక్ తధ్యం
మంగళగిరిలో వైఎస్సార్సీపీ ఇప్పటికే రెండు సార్లు విజయం సాధించింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మరోమారు విజయం సాధించి తీరుతామని,నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని అన్నారు. సమావేశంలో పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలను కూలంకుషంగా చర్చించామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. గుంటూరు పార్లమెంటు స్థానంతో పాటు పార్లమెంట పరిధిలోని ఏడు నియోజక వర్గాలు ఈస్ట్, వెస్ట్, తెనాలి, పొన్నూరు, తాడికొండ, మంగళగిరి, పత్తిపాడులో విజయానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. నేతల్లో అసంతృప్తి గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సమన్వయకర్తలు, శాసన సభ్యులు, అందరూ సంతృప్తితో ఉన్నారని చెప్పారు. పార్టీలోకి ఎవర్ని తీసుకుంటే పార్టీ బలోపేతం అవుతుందో వారి పేర్లు కూడా చర్చించామని, అందుకు ప్రణాళికా బద్దంగా ముందుకెళ్తామని తెలిపారు.
మార్పు చేసిన నియోజక వర్గాల్లో మాత్రమే పేర్లు ప్రకటించాం
అయితే మార్పు చేసిన నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తున్నామని పేర్లు ప్రకటించని నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉండదని గుర్తించాలని అన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు కిలారు వెంకట రోశయ్య, అన్నబత్తుని శివకుమార్, మేకతోటి సుచరిత,ఎమ్మెల్సీలు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, పార్లమెంటు పార్టీ ఇంచార్జ్ ఉమారెడ్డి వెంకట రమణ, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు డొక్క మాణిక్య వరప్రసాద్,నియోజకవర్గాల సమన్వయకర్తలు గంజి చిరంజీవి,నూరీ ఫాతిమా, బలసాని కిరణ్ కుమార్, నియోజకవర్గ పరిశీలకులు పాల్గొన్నారు.