ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో విజయవంతంగా అమలైన ఈ వ్యవస్థను త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్టాల్లో కూడా అమలు పర్చేందుకు ఇ.సి.ఐ సిద్దం
ఈ వ్యవస్థ వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించేందుకు శిక్షణా కార్యక్రమ నిర్వహణ
వెలగపూడి : రాష్ట్రంలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రేరేపిత రహిత ఎన్నికల పర్యవేక్షణను పెంపొందించేందుకు రూపొందించబడిన ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలుకు భారత ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య అంతరాయం లేని సమన్వయం, గూఢచార భాగస్వామ్యాన్ని నిర్ధారించడం ఈ వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం. ఆన్లైన్ ప్లాట్ ఫార్ము ద్వారా అమలయ్యే ఈ విధానం అమలు వల్ల ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలు తీసుకునే చర్యలు, వాటికి సంబందించిన వివరాలు అన్నీ ఎప్పటి కప్పుడు ఆన్ లైన్లో నమోదు కావడమే కాకుండా అప్డేటెడ్ సమాచారం అందుబాటులో ఉండటం వల్ల ఎటు వంటి మానవ తప్పిదాలకు, అక్రమాలకు అవకాశం లేకుండా ఉండేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. 2023 డిసెంబర్ మాసంలో చత్తీస్గడ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన సాధారణ ఎన్నికల్లో తొలిసారి ఈ వ్యవస్థను విజయవంతంగా వినియోగించడం జరిగింది. ఆ అనుభవంతో త్వరలో ఎన్నికలు జరుగునున్న రాష్ట్రాల్లో కూడా ఈ విధానాన్ని అమలు పర్చేందుకు అవసరమైన శిక్షణను ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల అధికారులకు ఇచ్చేందుకు బెంగుళూరుకు అధికార బృందాన్ని పంపింది. ఈ ప్రక్రియలో భాగంగా భారత ఎన్నికల సంఘం అధికార బృంధం బెంగుళూరులో మంగళవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో పాటు పలు కేంద్ర, రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నోడల్ అధికారులు వీడియో కాన్పరెన్సు ద్వారా వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుండి పాల్గొన్నారు. వీడియో కాన్పరెన్సు ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు పాల్గొన్న ఈ శిక్షణా కార్యక్రమంలో బెంగుళూరు, డిల్లీ నుండి భారత ఎన్నికల సంఘం అధికారులు పాల్గొని ఈఎస్ఎంఎస్ వినియోగంపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరిస్తూ, ఆ వ్యవస్థ వినియోగంలో పలువురు అధికారులకు వచ్చిన సందేహాలను భారత ఎన్నికల సంఘం డైరెక్టర్ పంకజ్ శ్రీవాస్తవ్ నివృత్తి పర్చారు. ఈ శిక్షణా కార్యక్రమం ముగింపు సందర్బంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ వినియోగం వల్ల ఆటోమేటిక్ గా డాటా జనరేట్ అవ్వడం, సేవ్ అవ్వడం వల్ల మానవ తప్పిదాలకు, డూప్లికేషన్ కు అవకాశం ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్, ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్సు, వాణిజ్య పన్నులు, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో తదితర ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలు ఈ వ్యవస్థను వినియోగించేటప్పుడు ఏ శాఖ ఎటు వంటి విధులను నిర్వహించాలి అనే అంశంపై ప్రొటోకాల్ సమస్య తలెత్తకుండా ఉండేందుకై ప్రామాణిక ఆపరేషన్ విధానాన్ని రూపొందిచాలని కోరారు. ఈ శిక్షణా కార్యక్రమంలో వినియోగంపై చక్కని అవగాహన కల్పించారని, అయితే డెమో నిర్వహణ సమయంలో ఈ వ్యవస్థ వినియోగంపై ఏమైనా సందేహాలు, సమస్యలు తలెత్తితే తక్షణమే వాటిని నివృత్తి పర్చేందుకు సంబంధిత అధికారులు అందుబాటులో ఉండాలని ఆయన కోరారు. ఈ శిక్షణా కార్యక్రమంలో అడిషనల్ డి.జి. (లా అండ్ ఆర్డర్) ఎస్.బాగ్చీ, ఐ.జి.పి. పి. వెంకట రామి రెడ్డి, స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో డైరెక్టర్ ఎం.రవిప్రకాష్, వాణిజ్య పన్నుల శాఖ స్పెషల్ కమిషనర్ అభిషిక్ కిశోర్, అదనపు సీఈవో పి. కోటేశ్వరరావు తదితరులతో పాటు ఎక్సైజ్, ఇన్కమ్ టాక్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తదితర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నోడల్ అధికారులు పాల్గొన్నారు.