రోజుకు మూడు సభలు
రాష్ట్రాన్ని చుట్టేయనున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి రంగంలోకి దిగనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్ల కోసం ప్రాంతాల వారీగా కమిటీ్ని నియమించారు. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ 1, రాయలసీమ 2 జోన్లుగా విభజించి కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలతో పవన్ సమావేశం అయ్యారు. ప్రతీ జోన్ లోనూ కన్వీనర్లు, కో కన్వీనర్లు, కమిటీ సభ్యులు, లీగల్ టీం, డాక్టర్స్ టీం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని పూర్తి సమన్వయంతో నిర్వహించేలా పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని రాజకీయ పార్టీలన్నీ గట్టిగా నమ్ముతున్నాయి. అందుకే క్షేత్రస్థాయిలో పర్యటనలకు పార్టీ అధినేతలను ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.. ఇప్పటికే టీడీపీతో జత కట్టి పోటీ చేయాలని నిర్ణయించింది జనసేన పార్టీ.. మరోవైపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ నెలాఖరు నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలకు రెడీ అవుతున్నారు. రోజుకు మూడు బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు.
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నెలాఖరు నుంచి పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలు, బహిరంగ సభలు ప్రారంభమవుతాయని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బహిరంగసభలు ఏర్పాటుచేసేలా ప్లాన్ చేశామన్నారు.. రోజుకు మూడు సభల్లో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటారని వెల్లడించారు.. ఈ సభలను విజయవంతం చేసే బాధ్యతను జోనల్ కమిటీలు తీసుకోవాలని సూచించారు. మరో రెండు నెలలు శక్తివంచన లేకుండా కష్టపడితే వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యమని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి 191 మందితో కమిటీలు వేశాం. మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేనాని పర్యటించేలా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు నాదెండ్ల మనోహర్. ప్రస్తుతం అయోధ్య పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్.. తిరిగి రాష్ట్రానికి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలపై దృష్టిసారించనున్నారు. ఇప్పటికే.. వైసీపీ నుంచి పలువురు నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు. మరికొంతమంది కూడా జనసేనలో చేరే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.