వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి
గుంటూరు : ఏడాది క్రితమే నీతి ఆయోగ్ ‘వికసిత భారత్-2047′ ప్రణాళికను విడుదల
చేసిందని దీనినే విజన్-2047 అని పేరుమార్చి చంద్రబాబు కాపీ కొట్టారని, బాబు
సొంత బ్రాండింగ్ ఏమీ కాదని రాజ్యసభ సభ్యులు, వైయస్సార్ సిపి జాతీయ ప్రధాన
కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. పలు అంశాలపై ట్విట్టర్ లో ఆదివారం ఆయన
స్పందించారు. 2047 నాటికల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అగ్రస్థానంలో
ఉంటుందని అందులో నీతి ఆయోగ్ పేర్కొందని చెప్పారు. దానినే బాబు కాపీ కొట్టి
దేశానికి, రాష్ట్రానికి తాను దిశా నిర్దేశం చేస్తున్నట్టు బిల్డప్పులు
ఇస్తున్నారని ఎద్దేవా చెశారు. ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టొద్దంటూ హైద్రాబాద్
లో కూర్చొని ఏపీ విపక్షనేత చంద్రబాబు పిలుపునివ్వడం బట్టి…వారి నిరాశ,
నిస్పృహలను అర్థం చేసుకోవచ్చన్నారు. 2019లో ఎదురైన ఓటమి వల్ల పగతో వైయస్సార్
సిపిపై రగిలిపోతున్నారని చెప్పారు. 2024లో మళ్ళీ ఓడిస్తే అర్ధంలేని మాటలు
మానేసి చంద్రబాబు మామూలు మనిషి అవుతారని తెలిపారు.ఏపీ లో ఎన్నిక ఏదైనా ఫ్యాన్
దే ప్రభంజనమని సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికల్లో 85 శాతానికి పైగా వైయస్సార్
సిపి కైవసం చెసుకుందని చెప్పారు. కుప్పంలో ఆరు వార్డు స్థానాలకుగాను ఐదు
ప్యాన్ వశమయ్యాయని, 2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ కు ఇదే సంకేతమని ఆయన
చెప్పారు.
ఫ్లడ్ వాచ్’ మొబైల్ అప్లికేషన్ ప్రారంభించడం అభినందనీయం : వరదలను అంచనా
వేసేందుకు గాను ‘ఫ్లడ్ వాచ్’ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించినందుకు సెంట్రల్
వాటర్ కమిషన్ను విజయసాయిరెడ్డి అభినందించారు. దీంతో వరద ముంపు ప్రాంతాల్లో
నివసించే ప్రజలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.. ప్రయాణీకులు,
పర్యాటకులు కూడా దీనిని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ప్రజలకు రియల్ టైమ్
ప్రాతిపదికన ఏడు రోజుల పాటు వరద పరిస్థితి గురించి సమాచారం ఇవ్వడంతో పాటు
సూచనలు కూడా చేస్తుండడమే ఈ యాప్ లక్ష్యమని ఆయన చెప్పారు.