సుల్యారీ, బ్రహ్మదియా గనులపై చర్చ
మైనింగ్ లో ఎపిఎండిసి ప్రగతిని వివరించిన అధికారులు
ఎపిఎండిసి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన అదనపు కార్యదర్శి
మైనింగ్ ప్రాజెక్ట్ లకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ
విజయవాడ : కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖకు చెందిన అదనపు కార్యదర్శి ఎం.నాగరాజు
విజయవాడలో ఎపిఎండిసి అధికారులతో శుక్రవారం భేటీ అయ్యారు. కానూరులోని ఎపిఎండిసి
కార్యాలయంలో రాష్ట్ర మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది,
ఎపిఎండిసి విసి, ఎండి విజి వెంకటరెడ్డి, పలువురు అధికారులతో ఆయన
సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మైనింగ్ రంగంలో కార్పోరేషన్ సాధిస్తున్న ప్రగతిని
కేంద్ర అదనపు కార్యదర్శికి ఎపిఎండిసి విసి&ఎండి శ్రీ విజి వెంకటరెడ్డి
వివరించారు. మధ్యప్రదేశ్ లోని సుల్యారీ బొగ్గుగనిని దక్కించుకుని జాతీయ
స్థాయిలో వాణిజ్య సరళిలో బొగ్గును ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వరంగ సంస్థలైన
కోల్ ఇండియా, సింగరేణి సరసన ఎపిఎండిసి నిలిచిందని తెలిపారు. రానున్న రోజుల్లో
ఝార్ఖండ్ లోని బ్రహ్మదియా గనిలో కూడా కోకింగ్ కోల్ ఉత్పత్తిని
ప్రారంభించేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో సీఎం
వైయస్ జగన్, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల నేతృత్వంలో
మైనింగ్ రంగంలో అనేక సంస్కరణలను తీసుకువచ్చి అమలు చేస్తున్నామని వివరించారు.
కేంద్రం కేటాయించిన మేజర్ మినరల్స్ ను కూడా సకాలంలో లీజుల ప్రక్రియను పూర్తి
చేసి, మైనింగ్ ఆపరేషన్స్ ను ప్రారంభించేందుకు చేపట్టిన చర్యలకు కేంద్ర గనులశాఖ
నుంచి ప్రోత్సాహకాలను కూడా అందుకున్నామని తెలిపారు.
2020-21 ఆర్ధిక సంవత్సరంలో రూ.502 కోట్లు, 2021-22 లో రూ.902 కోట్లు మైనింగ్
ఆదాయాన్ని ఆర్జించామని అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత నెల
వరకు రూ.1073 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం జరిగిందని అన్నారు. 2024-25 నాటికి
రూ.4250 కోట్ల మేర మైనింగ్ ఆదాయాన్ని ఆర్జించాలనే లక్ష్యం తో ఎపిఎండిసి
పనిచేస్తోందని వివరించారు.
రానున్న రోజుల్లో మరికొన్ని మినరల్స్ ఆపరేషన్స్ లో కూడా ఎపిఎండిసి
పాల్గొంటోందని, కేంద్రం నుంచి తమకు మరింత సహకారం ప్రోత్సాహాన్ని అందించాలని
విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి
ఎం.నాగరాజు మాట్లాడుతూ దేశంలో ఖనిజ అవసరాల కోసం ఇతర దేశాల నుంచి దిగుమతులు
చేసుకోవాల్సిన పరిస్థితిని పూర్తిగా మార్చాలని కేంద్రం భావిస్తోందని తెలిపారు.
దేశీయంగా మనకు అపారంగా ఉన్న ఖనిజాలను వెలికితీయడంపై కేంద్రం దృష్టి
సారించిందని తెలిపారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల్లోనూ మైనింగ్ పాలసీలను
పర్యవేక్షించడం, కొత్త మైనింగ్ ఆపరేషన్స్ ను ప్రారంభించడం కోసం ఆయా
రాష్ట్రాలను ప్రోత్సహిస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలతో
పోటీ పడుతూ మైనింగ్ రంగంలో మంచి సంస్కరణలను తీసుకువచ్చి, ఉత్తమ ఫలితాలను
సాధించడం పట్ల అభినందనలు తెలిపారు. సుల్యారీ, ఝార్ఖండ్ బొగ్గు గనులకు
సంబంధించి కేంద్రం ద్వారా అవసరమైన సహకారాన్ని ఎటువంటి జాప్యం లేకుండా అందేలా
చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్రం అదనపు కార్యదర్శి ఎం.నాగరాజుకు
ఎపిఎండిసి అధికారులు జ్ఞాపికను అందచేశారు. ఈ సమావేశంలో సంస్థ సలహాదారులు
డిఎల్ఆర్ ప్రసాద్, కె.నాగేశ్వరరావు, జనరల్ మేనేజనర్లు టి.నతానేయల్, ఆళ్ళ
నాగేశ్వరరెడ్డి, ఎస్ వి సి బోస్, మైన్స్ శాఖ జెడి శ్రీనివాసరావు, డిడి
శ్రీనివాసకుమార్, ఎపిఎండిసి డిజిఎంలు సి.లీలా, జి.రాజారమేష్, వి.ఫణికుమార్,
విఘ్నేష్ రెడ్డి, సివిల్ ఇంజనీర్ శంభూప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.