అబుధాబిలో ఢిల్లీ ఐఐటీ శాఖ
భారత్ పెట్రో నిల్వలకు సహకారం
ఇంధన రంగంలో పెట్టుబడుల పెంపు
యూఏఈలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన
పలు ఒప్పందాలపై సంతకాలు
అబుధాబి : గల్ఫ్‌లో కీలకమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో (యూఏఈ) ఆర్థిక
బంధాన్ని భారత్ మరింత బలోపేతం చేసుకోబోతోంది. ఫ్రాన్స్‌తో కీలక రక్షణ
ఒప్పందాలు చేసుకుని తిరుగు ప్రయాణమైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం
యూఏఈలో పర్యటించారు. ఆ దేశాధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్
నహ్యాన్తో చర్చలు జరిపారు. ఇరువురు నేతల సమక్షంలో ఆర్థిక, ఇంధన,
విద్యారంగాల్లో పలు ఒప్పందాలు కుదిరాయి. ఇరుదేశాల మధ్య వ్యాపార వాణిజ్య
లావాదేవీలకు స్థానిక కరెన్సీల్లో చెల్లింపులు చేసుకోవాలని నేతలు నిర్ణయించారు.
అంటే ఎగుమతి దిగుమతుల సమయంలో చెల్లింపులను రూపాయి, దిర్హమ్లలో చేసుకోవచ్చు.
దీనివల్ల లావాదేవీల ఖర్చులు, సమయం తగ్గుతాయి. భారత యూపీఐతో, ఎమిరేట్స్
డిజిటల్ ఇన్స్టంట్ పేమెంట్ ప్లాట్‌ఫాం ఐపీపీని అనుసంధానిస్తారు. దీనికి
సంబంధించిన ఒప్పందంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, యూఏఈ సెంట్రల్
బ్యాంకు గవర్నర్ ఖలీద్ మహమ్మద్ బలామా సంతకాలు చేశారు. అబుధాబిలో దిల్లీ
ఐఐటీశాఖ ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. విదేశాల్లో ఏర్పాటు చేయబోతున్న రెండో
ఐఐటీ ఇది. కొద్దిరోజుల కిందటే టాంజానియాలో మద్రాస్ ఐఐటీశాఖ ఏర్పాటుకు ఒప్పందం
కుదిరింది. అబుధాబి క్యాంపస్‌లో వచ్చే జనవరి నుంచి మాస్టర్స్ కోర్సులను,
వచ్చే ఏడాది సెప్టెంబరు నుంచి బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను ఆరంభిస్తారు. ఇంధన
రంగం, కృత్రిమ మేధ, కంప్యూటర్ సైన్స్- ఇంజినీరింగ్, ఆరోగ్యం, గణితం,
సైన్స్, హ్యుమానిటీస్ కోర్సులు నిర్వహిస్తారు.
100 బిలియన్ డాలర్లకు : ప్రధాని మోడీని ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహ్మద్
బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఆప్యాయంగా అధ్యక్ష భవనంలోకి ఆహ్వానించారు. ‘మీ
నుంచి అన్నివేళలా సోదర ప్రేమను పొందా. మీ ఉత్సాహం, అభివృద్ధి పట్ల మీ
దూరదృష్టి అద్భుతం. మన రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడింది. అందులో మీ
భాగస్వామ్యం మరువలేనిది. భారత్‌లోని ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఆత్మీయ
స్నేహితుడిగా భావిస్తున్నారు’ అని అధ్యక్షుడు నహ్యాన్‌ను ఉద్దేశించి మోడీ
ప్రశంసలు కురిపించారు. ‘గత ఏడాది సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదిరిన
తర్వాత రెండు దేశాల మధ్య వాణిజ్యం 20శాతం వృద్ధి చెందింది. వీటి విలువ
తొలిసారిగా 85 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ సెప్టెంబరులో జీ-20 సదస్సులోగా
ఇది 100 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటుతుందని ఆశిస్తున్నా’ అని మోదీ
పేర్కొన్నారు. పర్యావరణ మార్పులపై జరిగే కాప్-28 సదస్సు అధ్యక్ష పదవికి
పోటీపడుతున్న యూఏఈకి భారత్ పూర్తి మద్దతిస్తుందని ప్రకటించారు. ద్వైపాక్షిక
సంబంధాల్లోని అవరోధాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించామని భేటీ అనంతరం
విడుదలైన సంయుక్త ప్రకటన వెల్లడించింది. గ్రీన్ హైడ్రోజన్, సైర విద్యుత్తు,
గ్రిడ్ కనెక్టివిటీల్లో సహకరించుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఇంధన
రంగం, భారత్ పెట్రో నిల్వల రంగాల్లో పెట్టుబడులను మరింతగా విస్తరించాలని
అంగీకారానికి వచ్చినట్లు వివరించింది. వాతావరణ మార్పులపైనా రెండు దేశాలు కలిసి
పని చేయాలని నిర్ణయించాయని తెలిపింది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని
తగ్గించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు హామీ ఇచ్చిన 100 బిలియన్ డాలర్ల
సాయాన్ని వెంటనే ఇవ్వాలని ఇద్దరు నేతలు డిమాండు చేశారని సంయుక్త ప్రకటన
వెల్లడించింది.
ప్రత్యేక శాకాహార విందు : పారిస్ నుంచి అబుధాబి చేరుకున్న మోడీకి
విమానాశ్రయంలో యూఏఈ యువరాజు షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయేద్ సాదర
స్వాగతం పలికారు. తర్వాత అధ్యక్ష భవనంలో ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు.
స్థానికంగా సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలతో పూర్తిగా శాకాహార పదార్థాలతో
తయారు చేసిన విందును ప్రధానికి వడ్డించారు. గోధుమలు, ఖర్జూర సలాడ్లతో పాటుగా
మసాలా సాస్, కాల్చిన కూరగాయలను స్టార్టర్లుగా అందించారు. ఈ వంటకాల్లో వాడిన
నూనె కూరగాయలతో తయారు చేసిందే. ఈ విందులో పాలు, గుడ్డుతో తయారు చేసిన
పదార్థాలు లేకుండా చూశారు.