అమరావతి : గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఫలితంగా రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్
రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు అంగీకారం తెలిపాయని
రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి
పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శనివారం పలు అంశాలు వెల్లడించారు.
టీసీఐఎల్, డైకిన్, సెల్ కాన్ రెజల్యూట్, సన్నీఆపోటెక్ నార్త్ అమెరికా వంటి
దిగ్గజ సంస్థలతో పాటు ప్రపంచ స్థాయి ప్రసిద్ధి చెందిన 23 సంస్థలు 15,711
కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూలు కుదుర్చుకున్నాయని అన్నారు. దిగ్గజ
సంస్థల పరిశ్రమలు,యూనిట్లు ఏర్పాటుతో రాష్ట్రంలో 57640 మందికి ఉపాధి
లభిస్తుందని అన్నారు.
కుంటిసాకులు వెతుకుతున్న ప్రతిపక్షాలు : రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు
ఎంఎల్సీ ఎన్నికల ముందు కుంటిసాకులు వెతుకుతున్నాయని విజయసాయి రెడ్డి అన్నారు.
వారు ఆరోపిస్తున్నట్లుగా నకిలీ ఓట్లకు సంబంధించిన ఆధారాలుంటే కేంద్ర ఎన్నికల
సంఘానికి ధైర్యంగా ఫిర్యాదు చేయాలని అన్నారు. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను
తయారు చేస్తుందని అన్నారు. వైఎస్సార్సీపీ ని నిందించడం ఎంతవరకు సమంజసమని
ప్రశ్నించారు. విద్య, గృహ నిర్మాణ రంగాలకు బ్యాంకర్లు సహకారం అందించాలి :
విద్య, గృహ నిర్మాణ రంగాలు సామాజిక ఆర్థిక ప్రగతిలో కీలకమని, ఈ రెండు రంగాల
పట్ల బ్యాంకర్లు మరింత సానుకూల దృక్పథంతో, అనుకూల కార్యాచరణతో ముందడుగు
వేయాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
కోరినట్లు ఆయన తెలిపారు.