రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా
వెలగపూడి సచివాలయం : రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలు తప్పనిసరిగా ఎంసీఎంసీ కమిటీ ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. జిల్లా స్థాయిలో ప్రసారం చేసే ప్రకటనలకు జిల్లా ఎంసీఎంసీ కమిటీ, రాష్ట్ర స్థాయిలో ప్రసారం చేయదలచిన ప్రకటనలకు రాష్ట్ర ఎంసీఎంసీ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుందన్నారు. గురువారం రాజకీయ ప్రకటనల విషయంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముకేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయదలచిన తేదీకి కనీసం మూడు రోజుల ముందు సంబంధిత రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లో కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ ప్రకటనలపై ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని రాజకీయ పార్టీలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంసీఎంసీ కమిటీ సభ్యులు అడిషనల్ సీఈవో కోటేశ్వరరావు, దూర దర్శన్ కేంద్రం విజయవాడ రీజినల్ న్యూస్ యూనిట్ డిప్యూటీ డైరెక్టర్ జి.కొండలరావు, పీఐబీ మీడియా కమ్యూనికేషన్ ఆఫీసర్ టి. హెన్రీ రాజ్, జాయింట్ సీఈఓ వెంకటేశ్వర రావు, కమిటీ కన్వీనర్, డిప్యూటీ సీఈవో మల్లిబాబు, రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ప్రతినిథులు తదితరులు పాల్గొన్నారు.