233వ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మే 10న జరగబోయే కర్ణాటక ఎలక్షన్లో
ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైపై పోటీ చేస్తున్నారు. గతంలో రాష్ట్రపతులు,
ప్రధానులపై కూడా పద్మరాజన్ పోటీ చేశారు. ఇప్పటి వరకు అత్యధిక సార్లు
ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిగా రికార్డులకెక్కారు.’కింగ్ ఆఫ్ ఎలక్షన్’గా సుపరిచితులైన తమిళనాడుకు చెందిన కే పద్మరాజన్ కర్ణాటక
ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పటి వరకు 232 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన
పద్మరాజన్ మే 10న జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో 233వ సారి షిగ్గావ్ అసెంబ్లీ
నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారికి
నామినేషన్ పత్రాలు సమర్పించారు. గతంలో ప్రధానమంత్రులకు, రాష్ట్రపతులకు
వ్యతిరేకంగా బరిలోకి దిగిన పద్మరాజన్.. ఈసారి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు
బొమ్మై మీద పోటీ చేస్తున్నారు. నామినేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా
శుక్రవారం పద్మరాజన్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. బొమ్మై కూడా ఆ రోజే
నామినేషన్ వేశారు.
ఎక్కువ సార్లు ఓడిపోయింది కూడా ఈయనే
అత్యధికసార్లు పోటీ చేసిన పద్మరాజన్.. ఎక్కువ సార్లు ఓడిపోయిన వ్యక్తిగా కూడా
రికార్డులకెక్కారు. 1986లో మెట్టూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా
పద్మరాజన్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. ఆ తర్వాత మాజీ ప్రధానులు అటల్
బిహారీ వాజ్‌పేయీపై లఖ్‌నవూలో, పీవీ నరసింహారావుపై ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో
పోటీ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్ నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలాం,
ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీపై పోటీ చేశారు. దీంతో పాటు ప్రముఖ రాజకీయ
నాయకులు.. ఎంకే స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి, యడియూరప్ప, కరుణానిధి, జయలలిత.
ఎస్ఎం కృష్ణపై పోటీ చేశారు.సర్పంచ్ నుంచి రాష్ట్రపతి దాకా..
2019లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పోటీ చేసిన
పద్మరాజన్ ఎలాంటి ప్రచారం లేకుండానే 1,850 ఓట్లు సాధించారు. అలానే 2011
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మెట్టూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 6,773
ఓట్లు సాధించారు.
ఇప్పటివరకు పద్మరాజన్.. 5 రాష్ట్రపతి ఎన్నికలు, 5 ఉపరాష్ట్రపతి, 32 లోక్‌సభ, 50
రాజ్యసభ, 72 అసెంబ్లీ ఎన్నికలు, 3 ఎమ్మెల్సీ, 1 మేయర్, 3 చైర్మన్, 4 పంచాయతీ
ప్రెసిడెంట్, 12 కౌన్సిలర్, 2 జిల్లా కౌన్సిలర్, 3 యూనియన్ కౌన్సిలర్, 6
వార్డు మెంబర్ ఎన్నికలకు పోటీ చేశారు.
64 ఏళ్ల పద్మరాజన్ తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరుకు చెందిన వ్యక్తి.
హోమియోపతి వైద్యుడైన పద్మరాజన్.. అత్యధిక సార్లు పోటీ చేసి.. ఇండియా బుక్ ఆఫ్
రికార్డ్స్‌తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ఆ
సంస్థలు పద్మరాజన్ను ‘ఆల్ ఇండియా ఎలక్షన్ కింగ్’ అనే బిరుదుతో
సత్కరించాయి.పద్మరాజన్ నామినేషన్‌పై హవేరీ జిల్లా కలెక్టర్ రఘునందన
స్పందించారు. ‘ఈసారి పద్మరాజన్ షిగ్గావ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కానీ
ఆయన అంత సీరియస్ అభ్యర్థి కాదు. ఇక్కడ పోటీ చేయాలంటే.. అతడికి పది మంది
స్థానికుల మద్దతు కావాలి. కానీ ఆయనకు ఆ మద్ధతు లేదు. అందువల్ల ఆయన నామినేషన్
తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది” అని కలెక్టర్ పేర్కొన్నారు.