విజయవాడ : దేశ ఎల్లలు దాటినప్పటికీ ప్రాంతాలతో సంబంధం లేకుండా తెలుగు వారంతా ఒక్కరేనని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు. ఉమ్రా చేసేందుకు ఆయన కుటుంబసమేతంగా సౌదీ అరేబియాకు వెళ్లారు. పర్యటన ముగిసిన అనంతరం స్వదేశానికి తిరిగి వెళ్తున్న సమయంలో జెద్ధాలో సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్ (సాటా) ప్రతినిధి బృందంతో ఆయన మాట్లాడారు. కుల,మత, ప్రాంతీయ విబేధాలకు అతీతంగా తెలుగు వారందరూ ఒకటేనని వ్యాఖ్యానించారు. తద్వారా భారతీయ ప్రతిష్ఠను పెంపొందించాలని సూచించారు. దేశంలో ఆదర్శవంతంగా చెప్పే కేరళ రాష్ట్రం కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెరుగ్గా ఉందన్నారు. ఏపీఎన్ఆర్టీ సంస్ధ ప్రవాసీయుల సంక్షేమానికి కృషి చేస్తుందని అంజద్ బాషా పేర్కొన్నారు. సామాజిక సేవలో సాటా పని తీరును అభినందించారు. ఉప ముఖ్యమంత్రిను కలిసిన వారిలో శివ, సైమన్ పీటర్, రాంబాబు, ఫయాజ్, శాంతి తదితరులు ఉన్నారు.