వెలగపూడి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన
రూ.18518.29 కోట్ల లో గత ఫిబ్రవరి మాసాంతానికి నాటికి 70.81శాతం నిధులు ఖర్చు
కావడం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున
వెల్లడించారు. సబ్ ప్లాన్ నిధుల వినియోగం మరింతగా పెరగాలని , ఎస్సీల కోసం
కేటాయించిన నిధులన్నీ వారి సంక్షేమానికే ఉపయోగపడేలా చూడాలని అధికారులను
ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన ఎస్సీ సబ్ ప్లాన్(ఎస్సీ
కాంపొనెట్)కు చెందిన 30వ నోడల్ ఏజెన్సీ సమావేశంలో నాగార్జున సబ్ ప్లాన్ నిధుల
వినియోగంపై వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ
శాఖల్లో 43 శాఖలకు చెందిన అధికార ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తమ శాఖల
ద్వారా ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల వ్యయం గురించి వివరించారు. ఈ సందర్భంగానే
నాగార్జున మాట్లాడుతూ, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రధానమైన శాఖలకు ప్రభుత్వం
రూ.18518.29 కోట్లను ఎస్సీ సబ్ ప్లాన్ కోసం కేటాయించిందని చెప్పారు. అయితే
రాష్ట్రంలోని కొన్ని శాఖలు సబ్ ప్లాన్ ద్వారా తాము ప్రతిపాదించిన పనుల కోసం
అదనపు బడ్జెట్ కావాలని కోరడం, ప్రభుత్వం ఆ విధంగానే అదనపు బడ్జెట్ ను
కేటాయించడంతో ఈ మొత్తం రూ.20605.44 కోట్లకు చేరిందని తెలిపారు. సబ్ ప్లాన్
నిధుల వినియోగం విషయంలో కొన్ని శాఖలు అంచనాలకు మించి ప్రగతిని సాధిస్తుండగా
కొన్ని శాఖలు మాత్రం వెనుకబడి ఉన్నాయని గుర్తించామన్నారు. ఆయా శాఖల పనితీరు
ఆధారంగా గ్రేడ్లను నిర్ణయించామన్నారు. 76% నుంచి 100% నిధులను వినియోగించిన
శాఖలు ఏ-గ్రేడ్ గాను, 51% నుంచి 75% దాకా నిధులను వినియోగించిన శాఖలను
బీ-గ్రేడ్ గానూ,26% నుంచి 50% దాకా నిధులను వాడుకున్న శాఖలను సీ-గ్రేడ్ గాను,
25% వరకూ మాత్రమే నిధుల వినియోగం ఉన్న శాఖలను డీ-గ్రేడ్ గాను గుర్తించామని, ఈ
గ్రేడ్ల ఆధారంగానే సబ్ ప్లాన్ నిధుల వినియోగాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడం
జరుగుతుందని నాగార్జున వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన సబ్
ప్లాన్ నిధుల్లో రూ.13112.36 కోట్లు ఫిబ్రవరి మాసాంతానికి ఖర్చు అయ్యాయని
వెల్లడించారు. సబ్ ప్లాన్ నిధుల్లో అత్యధికశాతం ఖర్చు చేసిన విద్యుత్, సివిల్
సప్లయిస్, ప్రజారోగ్యం, పరిశ్రమలు, వైద్య విద్య, ఎస్సీ గురుకులాలు, రాష్ట్ర
క్రీడాప్రాధికార సంస్థ, భూ పరిపాలన, వ్యవసాయం, బలహీనవర్గాల గృహనిర్మాణం,
పంచాయితీరాజ్ తదితర శాఖల పనితీరును ప్రశంసించారు. నిధుల వినియోగంలో వెనుకబడిన
శాఖల పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. సబ్ ప్లాన్ ద్వారా కేటాయించిన
నిధుల్లో వినియోగించుకోని నిధులను మరొక ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్
చేసే అవకాశం లేదని గుర్తించాలని అధికారులకు సూచించారు.