ఏఐతో తమ జాబ్ పోతుందని 74 శాతం మంది భారతీయుల ఆందోళన
పరిస్థితులకు తగ్గట్టుగా ఉద్యోగులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని కోరుతున్న
సంస్థలు
ఏఐతో రోజువారీ విధులు మరింత సులభం అవుతాయన్న మైక్రోసాఫ్ట్ కంట్రీ హెడ్
కృత్రిమ మేధతో తమ ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని భారత్లోని 74 శాతం మంది
ఉద్యోగులు భావిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది.
అకస్మాత్తుగా ప్రపంచాన్ని చుట్టుముట్టిన కృత్రిమ మేధపై ప్రజాభిప్రాయం
తెలుసుకునేందుకు మైక్రోసాఫ్ట్ ఈ సర్వే నిర్వహించింది. భారత్కు సంబంధించి పలు
ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వే ప్రకారం భారత్లో 75 శాతం మంది తమ
పనిని ఏఐకి అప్పగించేందుకు రెడీగా ఉన్నారు. భారతీయ కంపెనీల యాజమాన్యాల్లో 90
శాతం తమ ఉద్యోగులు, కృత్రిమ మేధకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని
కోరుకుంటున్నాయి. కొత్త పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి తమ రోజువారీ
పనుల్లో భాగంగా కొత్త విషయాలు నేర్చుకోవాలని మైక్రోసాఫ్ట్ నివేదిక తేల్చింది.
ఏఐతో రోజవారీ ఉద్యోగ విధులు మరింత సులభంగా చేయవచ్చని మైక్రోసాఫ్ట్ కంట్రీ హెడ్
భాస్కర్ బసు తెలిపారు. ఏఐ వల్ల భారీ మార్పులు వస్తాయని, భవిష్యత్ ఏఐ
టెక్నాలజీతో కొత్త తరహా వృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ సాంకేతికతతో పనుల్లో
కఠినత్వం పోయి ఉద్యోగులు ఉల్లాసంగా, వినూత్నంగా తమ విధులు నిర్వహించవచ్చని
తెలిపారు.