ఏపీఎన్ఆర్టీఎస్ వారి కోఆర్డినేటర్ల సహాయం మరువలేనిది : కావ్య
విజయవాడ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు కోసం ఏపీ రాష్ట ప్రభుత్వ
సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ సంవత్సరంలో 365 రోజులు 24/7 పనిచేస్తుంది. ఎక్కడ
ఎటువంటి ఇబ్బంది ఎదురైనా చట్టబద్ధంగా వివిధ దేశాల్లో రాష్ట్రవాసులు
ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వారి సంక్షేమం, భద్రత, అభివృద్దే
ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో
ఏపీఎన్ఆర్టీఎస్ పనిచేస్తుంది. ప్రవాసాంధ్రులు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో
ఇబ్బందులు పడుతున్న ఎంతోమంది వలసకార్మికులకు ఆపన్నహస్తం అందించి ఏ ఆర్భాటం
లేకుండా ఏపీఎన్ఆర్టీఎస్ తన పని తానూ చేసుకుంటూ వెళ్తుంది. ఇది నిరంతర
ప్రక్రియ. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కావ్య,
అవినాష్ దంపతుల మధ్య విభేదాలతో వారి రెండేళ్ళ కుమార్తెపై స్థానిక కోర్టు నుండి
అవినాష్ ప్రయాణ నిషేధం పెట్టించాడు. అప్పటికే అవినాష్ వేధింపులు ఎక్కువ
అయ్యాయని , తాము స్వదేశం తిరిగి వచ్చే క్రమంలో విమానాశ్రయ అధికారులు తన కూతురు
భవిష్య పై ట్రావెల్ బ్యాన్ ఉందని అనుమతించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో
ఉన్నామని, తిరిగి ఇంటికి వెళ్ళలేక ఏమి చేయాలో తెలియని సమయంలో అదనపు కట్నం
కోసం తన భర్త, తనను, కూతురును, తల్లిదండ్రులను వేధిస్తున్నాడని తమను స్వదేశం
తీసుకెళ్లాలని కావ్య వీడియో మాధ్యమంగా కోరింది. ఇందులో తాము పడ్డ కష్టాలను
తెలిపింది. ఇది చూసిన వెంటనే రాష్ట్ర మత్స్యశాఖా మంత్రి డా. సీదిరి అప్పలరాజు
ఏపీఎన్ఆర్టీఎస్ దృష్టికి తీసుకురావడంతో రంగంలోకి దిగినఏపీఎన్ఆర్టీఎస్ ఈ
విషయమై దుబాయ్ లోని భారత కాన్సుల్ జనరల్ కార్యాలయానికి ఇమెయిల్ పంపింది.
ఏపీఎన్ఆర్టీఎస్ దుబాయ్ కో ఆర్డినేటర్లు వీరి వివరాలు పూర్తిగా తెలుసుకొని
వారి బాగోగులను, కావలసిన సహాయాన్ని అందించారు.
జిల్లా ఎస్ పీ రాధిక కూడా ఎలాగైనా వారిని స్వదేశం తీసుకువచ్చేలా చూడమన్నారు.
అవినాష్ – కావ్య , కావ్య తల్లిదండ్రులతో భారత కాన్సులేట్, ఏపీఎన్ఆర్టీఎస్ కో
ఆర్డినేటర్లు, దుబాయ్ లోని తెలుగు సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపారు. అవినాష్
తన డిమాండ్లను తెలపగా అన్నిటికి ఒప్పుకొని సంతకాలు చేసారు. అయినప్పటికీ సదరు
వ్యక్తి మాట మార్చి తన కూతురు పై ఉన్న ట్రావెల్ బ్యాన్ ను వెనక్కి తీసుకోనని
చెప్పాడు. తద్వారా వీరందరినీ కూడా స్వదేశం వెళ్ళకుండా చేయాలనుకున్నాడు.
మరోవైపు కావ్య తండ్రి ఆరోగ్యం బాలేకపోవడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో పాపను
అవినాష్ దగ్గర వదిలిపెట్టి ఏపీఎన్ఆర్టీఎస్ కో ఆర్డినేటర్ల సాయంతో
స్వదేశానికి పయనమయ్యారు. ఇవాళ కావ్య, ఆమె తల్లిదండ్రులు భారతదేశం
చేరుకున్నారు. ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి
మాట్లాడుతూ మా కో ఆర్డినేటర్లు, దుబాయ్ లోని తెలుగు సంఘాల ప్రతినిధులు
వీరిమధ్య సయోధ్య కుదిర్చి పాపను స్వదేశం తీసుకురావడానికి ఎంతో కృషి చేసారు.
ప్రసన్న సోమిరెడ్డి, విజయ కొంచా, జి. నరసింహ, ఎండూరి శ్రీనివాస రావు, కె.
సుదర్శన్, గూడూరు కోటేశ్వర్, తరపట్ల మోహన్ రావు, ఎం. తులసి కుమార్ మరియు
జగదీశ్ (కావ్య తండ్రి) సాక్షి సంతకాలు కూడా పెట్టారు. మరో వైపు కాన్సులేట్ తో
మాట్లాడుతున్నామని, పాపను కూడా భారతదేశం తీసుకురావడానికి సదరు వ్యక్తితో
చర్చలు జరుగుతూనే ఉంటాయన్నారు. స్వదేశం చేరుకున్న కావ్య, తన తల్లిదండ్రులు
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్.
మేడపాటి, మంత్రి డా. సీదిరి అప్పల రాజు, ఎస్ పీ రాధిక, దుబాయ్ లోని
ఏపీఎన్ఆర్టీఎస్ కో ఆర్దినేటర్లు, తెలుగు సంఘాల ప్రతినిధులకు కృతఙ్ఞతలు
తెలిపారు. తమ పాపను కూడా తమకు అప్పగించేలా చూడాలని కోరారు.