న్యూఢిల్లీ : నేషనల్ గ్రీన్ కార్ప్స్ (ఎన్జీసీ) కార్యక్రమంలో భాగంగా
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనకు మందున్న 13 జిల్లాల్లో జిల్లాకు 500
చొప్పున వివిధ పాఠశాలల్లో 6500 పర్యావరణ (ఎకో) క్లబ్బులు ఏర్పాటు చేసినట్లు
కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే వెల్లడించారు. రాజ్యసభలో
విజయసాయి రెడ్డి అడిగిన మంత్రి ప్రశ్నకు రాతపూర్వకంగా జవాబిస్తూ సెంట్రల్
సెక్టార్ స్కీం ఈఈఏటీ (ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్, అవేర్నెస్ ట్రైనింగ్) కింద
స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు పర్యావరణ సంబంధిత అంశాలు బోధించేందుకు,
వాటిపై అవగాహనను విస్తృత పరిచేందుకు దేశవ్యాప్తంగా 2001 నుంచి 2022 వరకు ఒక
లక్ష పర్యావరణ క్లబ్బులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పర్యావరణంపై అవగాహన కల్పించడంతోపాటు పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలైన మొక్కలు
నాటడం, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ దినోత్సవాలు నిర్వహించడం, సాలిడ్ వేస్ట్
మేనేజ్మెంట్ పై కెపాసిటీ బిల్డింగ్ వంటి వాటిలో విద్యార్థుల భాగస్వామ్యం
పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఒక్కో క్లబ్‌కు 5000
రూపాయలు ఆర్థిక సహాయం అందించిందని అన్నారు. ఈఈఏటీ స్కీంను 2022-23లో ఈఈపీ
(ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్, ప్రోగ్రాం) పేరుతో పునరుద్ధరించినట్లు మంత్రి
పేర్కొన్నారు. ఈఈపీ కింద ఇప్పటికే ఏర్పాటు చేసిన ఎకో క్లబ్ లతో పాటు యూత్
క్లబ్బులు, వివిధ ప్రభుత్వ స్కీంల కింద ఏర్పాటు చేసిన క్లబ్బులు, యూనిట్లు,
గ్రూపుల సభ్యలకు పర్యావరణ అంశాలపై అవగాహన కల్పించడం, పర్యావరణం పై వర్క్ షాప్
లు, ఎగ్జిబిషన్ లు, అవగాహన సదస్సులు, కాంపిటీషన్లు నిర్వహించడం, నేచర్
క్యాంపులు, వేసవి క్యాంపులు వంటి కార్యక్రమాలు నిర్వహించి స్థిరమైన జీవన
విధానాన్ని అలవర్చడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.