అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలను ప్రచారం చేయించాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది. ఫిబ్రవరి 15 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చన్న నేపథ్యంలో ఆ పార్టీ ముందస్తు ప్రచారానికి దిగేందుకు సిద్ధమైంది. తెలంగాణలో గెలుపు, ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం వంటివి పార్టీని ఏపీలో బలోపేతం చేస్తాయని కాంగ్రెస్ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు, సీనియర్ నాయకుల సేవలను వాడుకోవాలని నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులుగా చేసిన అనుభవం ఉన్న నేతలతో ఏపీలో ప్రచారం చేయించనున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని పాతతరం నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో వారికి ఉన్న గుర్తింపు ఉపయోగప డుతుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు.నోటిఫికేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికలు ఒకేసారి వస్తే మొదటి వారంలోనే తెలంగాణ నేతల సేవలను వినియోగించుకోవాలని, వేర్వేరు దశల్లో వస్తే పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డిని స్టార్ క్యాంపెనర్‌గా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్‌లో రేవంత్‌రెడ్డితో ప్రచారం చేయించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ త్వరలో ఏపీలో పర్యటిస్తా రని సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో ఆమె భేటీ అవుతారని తెలిసింది. తెలంగాణ ప్రభుత్వానికి, టీటీడీకి మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై ఆమె దృష్టి పెట్టినట్టు తెలిసింది.