మహిళా బిల్లు ఆమోదించాలి
గవర్నర్ వ్యవస్థ రద్దు కోసం జాతీయ స్థాయి పోరాటం
మీడియా సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ కీలక
వ్యాఖ్యలు
విజయవాడ : కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాల అప్రజాస్వామిక
విధానాలను, అరాచకాలను అరికట్టేందుకుగాను టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం,
కాంగ్రెస్ పార్టీల ఐక్యత ఆవశ్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ
కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం ఇష్టమున్నా, లేకున్నా
కలిసికట్టుగా బీజేపీ, వైసీపీని గద్దె దించితేనే ప్రజా స్వామ్యానికి మనుగడ
ఉంటుందన్నారు. విజయవాడ దాసరిభవన్లో బుధవారం మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర
కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశాన్ని
నిర్వహించారు. నారాయణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న
ప్రజా వ్యతిరేక చర్యల్ని దుయ్యబట్టారు. జీ20 దేశాల సమావేశానికి ప్రపంచ
వ్యాప్తంగా 20దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారనీ, ప్రధాని నరేంద్ర మోడీ
చైర్మన్ గా వ్యవహరించనున్న ఈ సమావేశాలకి కమలం గుర్తు తరహాలో లోగో పెట్టడం
సరికాదనీ, ఇక్కడ కూడా ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ గుర్తు పోలిన విధంగా లోగో
పెట్టడం దుర్మార్గమన్నారు. వెంటనే జీ 20 లోగో మార్చాలని డిమాండ్ చేశారు.
జీ20లో మహిళా విభాగమూ ఒక అజెండా ఉందని వివరించారు. పార్లమెంటులో మహిళా బిల్లు
ఇరవై ఏళ్లుగా పెండింగ్లో ఉందనీ, బీజేపీకి పూర్తి మెజార్టీ ఉ న్నందున ఆ బిల్లు
ఆమోదిస్తే, జీ20కి నాయకత్వం వహిస్తున్న మోడీ కి గౌరవం దక్కుతుందన్నారు.
చిత్తశుద్ధి ఉంటే జీ20 సమావేశాలకు ముందే మహిళా బిల్లును ఆమోదించాలన్నారు. ఇతర
పార్టీ నేతలపై ఒత్తిడి తెచ్చేలా సీబీఐ, ఈడీని మోదీ ప్రభుత్వం
వినియోగిస్తోందనీ, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి డబ్బు, పదవులను ఎరగా
చూపుతున్నారనీ మండి పడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులపై దాడులు రాజకీయ
కోణంలో చేసినవేననీ, అక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఢీ కొంటున్నాయని
వ్యాఖ్యానించారు. ఈ దాడుల పరంపరతో మధ్యలో అధికారులు ఒత్తిడి భరించలేక
ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న అప్రజాస్వామిక, రాజ్యాంగ
వ్యతిరేక విధానాలపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకోవాలని, ఉన్నత స్థాయి
విచారణ వేసి వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఈ అరాచకాలు
మరింత పెరిగి పోతాయంటూ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ల వ్యవస్థనూ
స్వార్ధం కోసం వాడుతున్నారనీ విమర్శించారు. తమిళనాడు, తెలంగాణ, కేరళ, పశ్చిమ
బెంగాల్లో పరిస్థితి చూశామనీ, గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని
డిమాండ్ చేశారు. డిసెంబరు మొదటి వారంలో జగరనున్న పార్టీ జాతీయ సమావేశంలో
దీనిపై చర్చించి, గవర్నర్ల రద్దు కోసం జాతీయ స్థాయి పోరాటానికి శ్రీకారం
చుడతామన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులోనూ భిన్నమైన తీర్పులు
రావడం వింతగా ఉందనీ, దీనిపై పూర్తి ధర్మాసనం ఒక స్పష్టమైన తీర్పు
ఇవ్వాలన్నారు. ఈడబ్ల్యూఎస్ విధానంపైనా తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో
చర్చిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని పవన్ కల్యాణ్
గతంలో చెప్పి తీరా ఇటీవల మోదీతో భేటీ అయ్యాక ఆయన మౌనం దాల్చారన్నారు. బీజేపీ
రాజకీయ వ్యూహం ఇలాగే ఉంటుందనీ, టీడీపీని బలహీన పరిస్తేనే బీజేపీ బలం
పెరుగుతుందని కేంద్రం భావిస్తోందని మండిపడ్డారు. నాడు జగన్ ఒక్క ఛాన్స్
అన్నారనీ, ఇప్పుడు పవన్ కూడా ఒక్క అవకాశం అంటున్నారనీ, చంద్రబాబు సైతం చివరి
ఛాన్స్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారని ఎద్దేవా చేశారు. మోదీ, జగన్ ప్రజలు
ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. టీడీపీ, జనసేన కేవలం వైసీపీపైనే విమర్శలు
చేస్తున్నాయన్నారు. బీజేపీని విమర్శించే సాహసం టీడీపీ చేయలేక పోతోందన్నారు.
పరోక్షంగా బీజేపీకి వైసీపీ, టీడీపీ, జనసేన అందరూ సహకరిస్తున్నారని
దుయ్యబట్టారు. బీజేపీ, వైసీపీ అరాచకాలను అరికట్టాలంటే అందరూ కలిసి రావాల్సిన
అవసరముందనీ, ఇష్టం ఉన్నా లేకున్నా టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్
పార్టీలు కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరముందని పునరుద్ఘాటించారు. టీడీపీ
ముందుకొచ్చి దీనికి నాయకత్వం వహించాలని సూచించారు. ఈ ఐక్యతతో రాష్ట్రానికీ,
ప్రజలకూ మేలు జరుగుతుందన్నారు. దేశంలో క్రమంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు
వీస్తున్నాయన్నారు. తెలంగాణాలో బీజేపీని టీఆర్ఎస్ బలంగా ఎదుర్కొందని, ఆమ్
ఆద్మీ పార్టీ సైతం మోదీకి గట్టి పోటీ ఇస్తోందని వ్యాఖ్యానించారు. ఏపీలో మాత్రం
మూడు ప్రధాన పార్టీలు బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదంటూ ఎద్దేవా చేశారు.
రిషికొండ తవ్వకాలపై నారాయణ వ్యాఖ్యానిస్తూ రిషీకొండ ప్రైవేటు ప్రాపర్టీ కాదనీ,
అది ప్రభుత్వ ప్రాపర్టీ అని స్పష్టంచేశారు. రిషీకొండను చూడకూడదంటూ ఎలా ఆంక్షలు
విధిస్తారంటూ ప్రశ్నించారు.
పర్యాటక ప్రదేశాన్ని దోచుకున్నారని తెలిసి పోతుందా…?
అని ప్రశ్నించారు. దీనిపై తాను హైకోర్టును ఆశ్రయించగా, అనుమతికి
అంగీకరించిందన్నారు. దీనిపై పర్యాటక శాఖ ఉన్నతాధికారి కన్నబాబు తాను
విదేశాల్లో ఉన్నానని తెలిసి ఆ సమయంలో ఒక్కడినే వచ్చి, రిషికొండను చూడాలంటూ లేఖ
రాయడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారులు సైతం ప్రభుత్వానికి ఒత్తాసు పలకడం
దుర్మార్గమన్నారు. బిగ్బాస్ షోపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీసుకున్నందుకు
ధన్యవాదాలు తెలిపారు. బిగ్ బాస్ షో వల్ల యువత పెడద్రోవ పడుతుందని ఆందోళన
వ్యక్తంచేశారు. బిగ్ బాస్ షో రద్దయ్యేంత వరకు నా పోరాటం కొనసాగుతుందని స్పష్టం
చేశారు.